చిత్రసీమ సంక్షోభంలో ఉందిప్పుడు. కరోనా కాటుకి పరిశ్రమ పూర్తిగా కుదేలైపోయింది. మళ్లీ తేరుకోవడానికి ఎన్నాళ్లు పడుతుందో తెలీదు. ఇప్పుడు చిత్రసీమని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇదే విషయాన్ని.. చిరంజీవి గుర్తు చేశారు. `లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరు అతిథిగా విచ్చేశారు. ఈ వేదికపై నుంచి చిరు.. చిత్రసీమని ఆదుకోవాలంటూ ప్రభుత్వాల్ని కోరారు.
చిత్రసీమ అంటే ఐదుగురు దర్శకులు, ఐదుగురు హీరోలు కాదని, కొంతమంది బాగా సంపాదించినంత మాత్రాన పరిశ్రమ పచ్చగా ఉన్నట్టు అనుకోకూడదని, వేలాదిమంది కార్మికుల్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. కరోనా కారణంగా నెల రోజులు షూటింగ్ ఆగిపోతే… కార్మికులు అల్లాడిపోయారని గుర్తు చేశారు. బడ్జెట్లు పెరిగిపోతున్నాయని, దానికి తగిన ఆదాయం రావడం లేదని టికెట్ రేట్లు పెంచాలన్న విషయాన్ని పరోక్షంగా ప్రభుత్వానికి తెలియజేశారు చిరు. “ఏ వస్తువైనా చూసి, నచ్చితే కొంటారు. కానీ సినిమా మాత్రం టికెట్ కొని.. అప్పుడు చూస్తారు. కచ్చితంగా వినోదం అందిస్తామన్న నమ్మకం ప్రేక్షకులది. దాన్ని మేం సాధ్యమైనంత వరకూ నిలబెట్టుకుంటాం. కొన్ని సార్లు తప్పులు జరగొచ్చు. సినిమాలు అనుకున్నట్టు రాకపోవొచ్చు. కానీ మేం మాత్రం కష్టపడతాం. అందుకే మా చిత్రసీమని దృష్టిలో ఉంచుకుని మేలు చేయడం. మాది ఆశ కాదు… అవసరం“ అంటూ తెలుగు ప్రభుత్వాల్ని చిరు వేడుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిత్రసీమకు మీటింగ్ ఉండబోతోందని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. కానీ.. ఆ సంగతి ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. జగన్ కి సూటిగా చెప్పాల్సిన విషయాల్ని… చిరు ఈ వేడుకని ఆసరా చేసుకుని పరోక్షంగా గుర్తు చేసినట్టైంది.