టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును డ్రగ్స్ వ్యవహారంలో మరింతగా నాన్చే వ్యూహం అవలంభిస్తున్నారు. కొద్ది రోజులుగా డ్రగ్స్ కేసు విషయంలో కేటీఆర్ పేరును తీసుకు రావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో గోవాకు వెళ్లారని.. మరొకటని ఆయన చెబుతూ వస్తున్నారు. అయితే కేటీఆర్ స్పందించకపోవడంతో అవి ఆరోపణలుగానే ఉండిపోయాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి తన పార్టీ నేత జడ్సన్‌తో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్‌కు లేఖ రాయించారు. దీంతో కేటీఆర్ స్పందించారు. నేరుగా కాకపోయినా మీడియా ప్రతినిధుల్ని చిట్ చాట్‌కు పిలిపించి … తన పేరును డ్రగ్స్ వ్యవహారంలోకి తేవడంతో మండిపడ్డారు.
కావాలంటే ఏ టెస్టుకైనా సిద్ధమన్నారు. దీని కోసమే కాచుకుని కూర్చున్న రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి వైట్ చాలెంజ్ విసిరారు. దమ్ముంటే టెస్టుల కోసం రావాలని సవాల్ చేశారు. అంతే కాదు వ్యూహాత్మకంగా వైట్ చాలెంజ్ విసిరారు. దాని కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా కలుపుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో లేరు. అయితే రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత మళ్లీ పార్టీ కోసం పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయన కూడా రేవంత్ ఈ ఇష్యూలో తనను ఎందుకు ఇన్వాల్వ్ చేశారో తెలియదు కానీ.. తెలంగాణకు మాత్రం డ్రగ్స్ పెద్దముప్పులా మారాయని అందుకే చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని ప్రకటించారు. సోమవారం వారిద్దరూ అమరవీరుల స్తూపం వద్దకు వస్తారు.
మరి కేటీఆర్ వస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. వస్తే ఓ ఇబ్బంది..రాకపోతే మరో ఇబ్బంది. కేటీఆర్ .. తాను టెస్టులకు సిద్ధమన్నారు కానీ రాహుల్ గాంధీ కూడా రావాలన్నారు. రాహుల్ గాంధీ రారు కాబట్టి కేటీఆర్ కూడా రారు. ఒక వేళ రాకపోతే కేటీఆర్ గురించి రేవంత్ వర్గం మరింత నెగెటివ్ ప్రచారం చేస్తుంది. ఇది టీఆర్ఎస్ను ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే రేవంత్ డ్రగ్స్ ప్రచారానికి ఎలా కౌంటర్ ఇవ్వాలా అని టీఆర్ఎస్ వ్యూహకర్తలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ కౌంటర్ ఏంటో ఇవాళో.. రేపో బయటపడే అవకాశం ఉంది.