అటు థియేటర్లు.. ఇటు ఓటీటీలు – రెండు వైపుల నుంచీ ప్రేక్షకులకు వినోదమే. ప్రతీ వారం థియేటర్లో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉన్నాయి. ఇంట్లో కూర్చుని ఓటీటీ ద్వారానూ కొత్త సినిమాలు చూసే అవకాశం దక్కుతోంది. ఈ వారం కూడా పుష్కలమైన వినోదం లభించబోతోంది. థియేటర్లలో 3 సినిమాలూ, ఓటీటీలూ రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే… అందరి దృష్టీ – లవ్ స్టోరీపైనే. ఈనెల 24న లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో పాటుగా మరో ప్రస్థానం, సిండ్రిల్లా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అదే రోజున ఓటీటీలో `ఆకాశవాణి`, `పరిణయం` స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాపై చిత్రబృందమే కాదు… చిత్రసీమ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. సెకండ్ వేవ్ తరవాత చాలా సినిమాలొచ్చినా, ప్రభావం చూపించినవి మాత్రం కొన్నే. థియేటర్లు నిండి, వసూళ్ల వర్షం కురిపించే సత్తా ఎందులోనూ కనిపించలేదు. లవ్ స్టోరీకి యూత్ తో పాటు, కుటుంబ ప్రేక్షకులూ కదిలి వస్తారని అందరి నమ్మకం. అది నిజమైతే – చిత్రసీమకు మరింత భరోసా కలుగుతుంది. కొత్త సినిమాల తాకిడి ఎక్కువ అవుతుంది. దసరా సినిమాల భవిష్యత్తంతా.. లవ్ స్టోరీపైనే ఆధారపడి ఉంది. తనీష్ నటించిన `మరో ప్రస్థానం`, లక్ష్మీరాయ్ నటించిన హారర్ థ్రిల్లర్ `సిండ్రిల్లా` శుక్రవారమే వస్తున్నాయి.
రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన `ఆకాశవాణి` శుక్రవారం సోనీలీవ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాలభైరవ సంగీతం అందించారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు సమకూర్చారు. సముద్రఖని కీలక పాత్రధారి. ఈ సినిమాని తక్కువ బడ్జెట్లో ప్రయోగాత్మకంగా రూపొందించారు. ముందు నుంచీ ఓటీటీకి ఇవ్వాలన్నదే లక్ష్యం. మంచి రేటు రావడంతో సోనీకి ఇచ్చారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు ఇంత వరకూ మొదలు కాలేదు. రాజమౌళి బ్యాచ్ సినిమా అంటే పబ్లిసిటీ పీక్స్ లోఉంటుంది. ఆకాశవాణికి మాత్రం అది లేదు. అదే రోజున సల్మాన్ దుల్కర్ డబ్బింగ్ సినిమా `పరిణయం` ఆహాలో విడుదల కానుంది. కల్యాణీ ప్రియదర్శిన్ కథానాయిక. దుల్కర్ కి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన డబ్బింగ్ సినిమాలకు సైతం ఆదరణ బాగుంటుంది. సో.. పరిణయంపై కూడా ఓ లుక్ వేయొచ్చు.