రాజకీయాల్లో ఏదో ఆశించి గుళ్లు కట్టడం కామన్ అయిపోయింది. తాము ఆశించింది ఇవ్వకపోతే ఆ గుళ్లు అమ్ముకునే సీజన్ కూడా వచ్చేసింది. కేసీఆర్ గుడి కట్టి వార్తల్లోకి వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మాజీ టీఆర్ఎస్ నేత ఇప్పుడు ఆ గుడిని విగ్రహంతో సహా అమ్మేస్తానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ తన ఇంటి ముందు గుడి నిర్మించారు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టి రోజూ పూజలు చేసేవారు.
గుండ రవీందర్ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రూ.3లక్షలు పెట్టి ఆలయం నిర్మించి అందులో కేసీఆర్, జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం పట్టించుకోలేదు. ఆయన మామూలుగా కేబుల్ ఆపరేటర్‌గా ఉన్నారు. తర్వాత దాన్ని కూడా టీఆర్ఎస్ జిల్లాస్థాయి నేతలు లాగేసుకున్నారు. దీంతో ఉపాధి కూడా లేకుండా పోయింది . తనను ఆదుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు.
తర్వాత తను కట్టినగుడి ముందే నిరసన చేశారు. ఓ సారి టవర్ ఎక్కారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి గుడిలో విగ్రహాలకు ముసుగులు వేసి పూజలు ఆపేసి.. బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన తర్వాత ఇక కేసీఆర్ గుడి అవసరం ఏముందనుకున్నారేమో కానీ అమ్మకానికి పెట్టేశారు. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. కొనేందుకు ముందుకు వస్తున్నారని.. ఎవరూ రాకుంటే కూల్చి వేస్తానని రవీందర్ చెబుతున్నారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్ కింద కామెంట్లలో అనేక మంది తాము కూడా ఉద్యమం కోసం పని చేసామని.. లక్షలు ఖర్చు పెట్టుకున్నామని కానీ తమకూ పదవులు రాలేదని వాపోతున్నారు.