మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ తరవాత రాజమౌళి చేయబోయే సినిమా ఇదే. ఈలోగా సర్కారువారి పాట, త్రివిక్రమ్ సినిమాల్ని పూర్తి చేస్తాడు మహేష్. ఈ కాంబినేషన్ ఇప్పుడు కుదిరినా, ఎప్పటి నుంచో వార్తల్లో ఉంది. రాజమౌళితో సినిమా చేయాలని మహేష్‌కీ, మహేష్‌తో పని చేయాలని రాజమౌళికీ గట్టిగానే ఉంది. అది ఇప్పుడు వర్కవుట్ అయ్యింది. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ తయారు చేశాడని ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ నవల హక్కుల్ని ఈ సినిమా కోసం కొన్నారన్న వార్తలూ వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ మహేష్ కోసం కథ సెట్ కాలేదన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
రాజమౌళి – మహేష్‌ల మధ్య ఈ కథకు సంబంధించి పలుమార్లు చర్చలు జరిగాయి. రాజమౌళి మూడు లైన్లు వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ మహేష్ కి సంతృప్తినివ్వలేదని తెలుస్తోంది. `మన సినిమాకి ఇంకా టైమ్ ఉంది కదా… ఫర్లేదు మీరు కూడా టైమ్ తీసుకోండి. లేట్ అయినా ఫర్వాలేదు` అని మహేష్ రాజమౌళికి చెప్పాడని టాక్. విజయేంద్రప్రసాద్ గత కొంతకాలంగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో సినిమా పూర్తవ్వడానికి మహేష్‌కి మరో యేడాదైనా పడుతుంది. సో.. 2022 చివర్లో రాజమౌళి – మహేష్ సినిమా మొదలు కావొచ్చు. ఈలోగా.. రాజమౌళి ఓ బాలీవుడ్ సినిమా చేస్తారని కూడా ప్రచారం మొదలైంది. ఆ బాలీవుడ్ సినిమా అయ్యేలోగా కథ రెడీ చేసినా చాలు.