ఆధారాలు లేకుండా తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారంటూ టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని సిటీ సివిల్‌కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని కోరారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలనికోరారు.
అయితే వైట్ చాలెంజ్ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, కేటీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కేటీఆర్‌పై విమర్శల విషయంలో తీవ్రత తగ్గించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం నలుగురికి ఆదర్శంగా ఉండటానికి మాత్రమే టెస్టులు చేయించుకోవడానికి సవాల్ చేశానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎందుకు ఉలిక్కి పడతారని ప్రశ్నించారు. కేటీఆర్ స్థాయికి తను సరిపోడని ఢిల్లీలో రాహుల్ గాంధీ రావాలంటున్నారని.. ఒకే వేళ రాహుల్ వస్తే ఇవాంకా ట్రంప్ రావాలంటారని ఎక్కడి నుంచి తీసుకు రావాలని రేవంత్ ప్రశ్నించారు.
అయితే రేవంత్ విసిరిన చాలెంజ్‌కు స్పందించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గన్ పార్క్ వద్దకు వచ్చారు. సింగరేణిలో జరిగిన ఘటనకు డ్రగ్సే కారణమని ఆయన అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ ను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత వీరిద్దరూ టెస్టులకు ఉస్మానియాకు వెళ్లలేదు. కానీ రేవంత్ రెడ్డి బండి సంజయ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లకు వైట్ చాలెంజ్ విసిరారు.