ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నమోదైన అషి ట్రేడింగ్ కంపెనీకి ఆఫ్ఘనిస్థాన్ నుంచి వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరికిన రూ.9వేల కోట్ల హెరాయిన్ మాత్రమే మొదటిది కాదని అంతకు ముందు కూడా అషీ ట్రేడింగ్ కంపెనీ సరుకు అందుకున్నదని తేలింది. రూ. 72వేల కోట్ల విలువైన హెరాయిన్ ఇలా చెలామణిలోకి వచ్చిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో విజయవాడ పోలీసు కమిషన్ హుటాహుటిన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారం అసలు ఒక్క ట్రేడింగ్ కంపెనీ రిజిస్టర్ అవడం మినహా ఏపీతో డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధాలు లేవు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు చూసుకుంటున్నాయి. ఏపీ పోలీసులు వారికి కావాల్సిన సమాచారం మాత్రమే చేరవేస్తున్నారు. ఇలాంటి సమయంలో పోలీస్ కమిషనర్ ఎందుకు అసలు ఏపీకి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. దర్యాప్తు చేస్తోందని కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే అసలు ఏపీలో ఎవరికీ సంబంధం లేదని పోలీస్ కమిషనర్ ఎలా తేల్చారనేది మరో కీలకమైన ప్రశ్న. విజయవాడను సేఫ్ జోన్‌గా ఎంచుకుని ఆషి ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేశారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత సేఫ్‌గా విజయవాడ ఎందుకు మారిందో కమిషనర్ శ్రీనివాసులు క్షణం కూడా ఆలోచించలేకపోయారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో డ్రగ్స్ వ్యాపారం అంతా తాలిబన్ల చేతుల్లోనే ఉంటుది. ఆ వ్యాపారం ద్వారానే వారు పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదిచుకుని అమెరికా సైన్యంపై పోరాటం చేశారు. వారికి ఇండియా నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యాపారం ఉన్నట్లుగా ఇప్పుడే తేలింది. ఇలా ఎంత కాలం నుంచి సాగుతోంది.. ఎలా సాగుతోంది.. అందులో తెలుగు వాళ్ల ప్రస్తావనేంటి అన్న అంశాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు నిగ్గు తేలుస్తాయి. ఏపీకి సంబంధం లేకపోతే వారే ప్రకటిస్తారు. ఏపీ వ్యక్తులకు సంబంధం ఉందని అషి ట్రేడింగ్ కంపెనీ పేరుతో దిగుమతి చేయడం ద్వారానే స్పష్టమవుతోంది.
అధికార పార్టీపై రాజకీయ విమర్శలు వస్తాయన్న ఆదుర్దాతో కంగారుతో పోలీస్ కమిషనర్ .. అసలు దర్యాప్తు చేయకుండా.. తమ చేతిలో లేని దర్యాప్తు విషయంలో కూడా బాధ్యత తీసుకుని ఏపీకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇది పోలీసు ప్రమాణాలకు విరుద్ధమన్న వాదనలు ఉన్నాయి. అయితే ఏపీ పోలీసులు ప్రస్తుతం తమదైన ప్రమాణాలు నిర్దేశించుకున్నారు కాబట్టి ఏమైనా చేయగలరన్న విమర్శలు విపక్ష నేతలు చేస్తున్నారు.