అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో వారిద్దరూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకూడదని అధికారపక్షం ఈ ప్లాన్ వేసినట్లుగా టీడీపీ అనుమానిస్తోంది. గతంలో అసెంబ్లీలో నిమ్మల రామానాయుడును సీఎం జగన్మోహన్ రెడ్డి డ్రామానాయుడు అని పదే పదే సంబోధించారు.
దీనికి రామానాయుడు తాను డ్రామానాయుడు అయితే మీరు .. మీరు జైలు రెడ్డా..? అని ప్రశ్నించారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. సభ్యుడిపై స్వయంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. దీనిపైనే ప్రివిలేజ్ కమిటీ చర్చించి… నిమ్మల రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఇక ఇక అచ్చెన్నాయుడుపై వివిధ రకాల కారణాలు చూపుతూ.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల ప్రివిలేజ్ మోషన్ కూడా ఉంది.
వాటికి అచ్చెన్నాయుడు జవాబులు ఇచ్చారు. అయితే ఆయనకు కూడా మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాలపై టీడీపీ వైసీపీ భయపడిందని ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నా.. ఉన్న కొద్ది మంది నోరెత్తుతారంటే భయం ఎందుకని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు.