తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చేయని విధంగా సామాజిక న్యాయం చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. చివరికి మద్యం దుకాణాల్లోనూ అందరికీ సమానంగా న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు తీసుకు వచ్చారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ను కూడా నెల రోజుల పాటు గడువు పొడిగించారు. అంతకు ముందు పొడిగించే చాన్సే లేదని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రిజర్వేషన్లను ఖరారు చేసి.. అమలు చేయడానికి సమయం కావాలి కాబట్టి నెల రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకూ మద్యం దుకాణాల టెండర్లకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. ఎవరు ఎక్కువగా టెండర్ వేస్తే వారికే షాపులు దక్కేవి. ఇప్పుడు రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. గౌడ్ సామాజికవర్గం ఎక్కువగా కల్లు, మద్యం వ్యాపారాల్లో ఉంటుంది కాబట్టి వారికి అత్యధిక రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. పదిహేను శాతం మద్యం దుకాణాలు వారికే కేటాయిస్తారు. మరో పది శాతం ఎస్సీలకు.. మరో ఐదు శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని చెప్పి జీవో రిలీజ్ చేశారు.
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లు రెండేళ్లకోసారి ఇస్తారు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ నెలతో ముగుస్తుంది. తర్వాత గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిస్తారు. ఇప్పటి వరకూ రిజర్వేషన్లు కల్పించకపోయినా గౌడ్ సామాజికవర్గానికి చెందిన మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున దుకాణాలు దక్కించుకుంటూ ఉంటారు. అయితే ఈ సారి పదిహేను శాతం వారికే కేటాయించడం వారికి సౌలభ్యం. అయితే ఎస్సీ, ఎస్టీల పేరుతో దుకాణాలను దక్కించుకుని నిర్వహించుకునేందుకు ఇతర బలవంతులకు ఈ రిజర్వేషన్ల ద్వారా అవకాశం దక్కనుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.