తూ.గో జిల్లా కడియం మండలంలో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ జడ్పీటీసీ స్థానంతో పాటు అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలు గెల్చుకుంది. అయితే ఇలాంటి విజయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సహించలేరు.. భరించలేరు. దానికి తగ్గట్లుగానే జనసేన నేతలకు వేధింపులు ప్రారంభమయ్యాయి. అయితే విజేతలంతా వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యామ్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. 24వ తేదీన మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకూ తమను తాము కాపాడుకోవడం కష్టమవుతోందని.. కుటుంబసభ్యులను వేధిస్తున్నారని వారు వచ్చి పవన్ కల్యాణ్‌కు తెలుపుకున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో ఇన్ని స్థానాలు గెల్చుకున్నా కూడా ఇంకా జనసేన గెల్చుకున్న స్థానాన్ని అక్రమంగా పొందాలనుకోవడం ఏమిటని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇందు కోసం ఒత్తిళ్లు, అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే గెలుపొందిన ఎంపీటీసీ అభ్యర్థుల్ని భయపెట్టేలా వారి అనుచరుల్ని కొట్టారని గుర్తు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ నేతలకు అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. అంతే కాదు 24వ తేదీన జరిగే మండలాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జనసేన ఎంపీటీసీలను ఇబ్బంది పెడితే తానే స్వయంగా వస్తానని వారికి భరోసా ఇచ్చారు.
స్వయంగా తానే వచ్చే పరిస్థితులు రావాలని ప్రభుత్వం కోరుకుంటే దానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరగకపోతే ఉత్పన్నమయ్యే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. దౌర్జన్యాలను ఇలానే కొనసాగిస్తే విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.