తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ అంశంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆర్టీసీ ఎండీగా చేరిన సజ్జనార్ మొదటి టాస్క్ ప్రయాణికులపైనే గురి పెట్టారు. చార్జీలు పెంచాలనే ప్రతిపాదనలను సీఎం దగ్గరకు తీసుకుపోయారు. ఆయన కూడా అంగీకరించారు. ఎంత మేర పెంచాలి అనేది కూడా డిసైడయింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక విద్యుత్ చార్జీలను కూడా పెంచాలని డిస్కంలు చాలా కాలంగా పట్టుబడుతున్నాయి. నష్టాలు పేరుకుపోతున్నాయని వారు చెబుతున్నారు. ఎంత మేర పెంచుతారనేదానిపై స్పష్టత లేదు కానీ ఈ సారి భారం ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీకి కానీ … విద్యుత్ సంస్థలకు కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేదు. అందుకే ఆ భారాన్ని ప్రజల నుంచే వసూలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల మూడ్‌లో ఉన్నారు. ప్రజలకు కష్టం వచ్చే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి అడుగేసే పరిస్థితి ఉంది. పైగా హుజురాబాద్ ఉపఎన్నికలు కళ్లముందు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలపై భారం వేసే నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటారా అన్నదానిపై సందేహం ఉంది. నిజానికి ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది.ఈ సమయంలో నేరుగా సామాన్యుడిపై భారం వేసే నిర్ణయాలు తీసుకుంటే మరింతగా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. మరి కేసీఆర్ ఈ నిర్ణయాలు తీసుకుంటారా ? లేక చివరికి ప్రజల కోసం ఎంత కష్టమైన భరిస్తానని ప్రతిపాదనలు తోసి పుచ్చుతారా అన్నది త్వరలో తేలనుంది.