చట్టాలెందుకున్నాయి? న్యాయ స్థానాల విధేమిటి? పరిపాలనా వ్యవస్థ లక్ష్యమేంటి? ఉద్యోగుల ధర్మేమేంటి? ఈ ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం. ప్రజల కోసం. అయితే.. న్యాయం, చట్టం, ఉద్యోగ వ్యవస్థ ఇవన్నీ పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రజల హక్కుల, రక్షణ ఇవన్నీ గాలికొదిలేస్తున్నారు. దాంతో వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రజలకు ప్రభుత్వాలపై, ప్రజలపై నమ్మకం పోతోంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ పోరాటానికి ఎవరు రావాలి? ఈ ప్రశ్నలు సంధిస్తోంది `రిపబ్లిక్`. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. దేవాకట్టా దర్శకుడు. రమ్యకృష్ణ కీలక పాత్రధారి. అక్టోబరు 1న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఇప్పుడు చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది.
ఓ పొలిటికల్ థ్రిల్లర్ ఈ చిత్రం. వ్యవస్థలు ఎలా పనిచేయాలి. ఎలా పనిచేస్తే ప్రజలకు మంచిది? అనే విషయాలపై లోతుగా చర్చించినట్టు ట్రైలర్లోనే తెలుస్తోంది. సాయిధరమ్ తేజ్ ఓ కలెక్టర్. తన ఉద్యోగ నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, తాను ఎదుర్కొనే రాజకీయ శక్తులు.. ఇవే ఈ కథకు మూలాలు. సీరియస్ గా సాగిన ట్రైలర్లో.. తన ఎమోషన్ ఏమిటో చెప్పేశాడు దేవాకట్టా.
”సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు
పట్టపగలే బాహాటంగా ప్రజల ప్రాణాలు తీస్తుంటే
కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకు కొమ్ము కాస్తున్నాయ్”
”ఆ రాక్షసులు ప్రపంచమంతటా ఉన్నార్రా..
కానీ వాళ్లని వ్యవస్థ పోషిస్తోందా? శిక్షిస్తోందా? అన్నదే తేడా”
”మీ భయం అజ్ఞానం అమాయకత్వం విశ్వాసమే
ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు”
”అజ్ఞానం గూడు కట్టిన చోటే
మోసం గుడ్లు పెడుతుంది…”
లాంటి శక్తిమంతమైన డైలాగులు ట్రైలర్లో వినిపించాయి. మణిశర్మ ఇచ్చి బీజియమ్ మరో ప్రధాన ఆకర్షణగా మారింది. మొత్తానికి సీరియస్ డ్రామాల్ని ఇష్టపడేవాళ్లకు… ‘రిపబ్లిక్’ నచ్చుతుందన్న భరోసా ఈ ట్రైలర్ కలిగించింది.