వివాదాస్పదంగా మారిన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవోను హైకోర్టు నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. పాలక మండలితో పాటు విడిగా 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే ఇది ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987కు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. టీడీపీ, బీజేపీ నేతలతో పాటు పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు కూడా పిటిషన్లు వేశారు.
వీటిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డును ప్రకటించినప్పటి నుండి తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాజకీయ అవసరాల కోసం, లాబీయింగ్ చేసే వారిని, వివిధ కేసుల్లో ఉన్న వారిని పవిత్రమైన ఆలయంలో పాలక మండలి సభ్యులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్ట్ బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం గవర్నర్ ను కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు చేశారు.
హైకోర్టును జీవోను సస్పెండ్ చేయడంతో పూర్తి స్థాయి పాలక మండలి సభ్యులుగా నియమితులైన 25 మందికి మాత్రమే పదవులు ఉంటాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందికి పదవులు జీవో సస్పెన్షన్లో ఉన్నంత కాలం పెండింగ్లో ఉంటాయి. ప్రమాణం చేసిన వారి పదవులు కూడా పెండింగ్లో ఉన్నట్లే.