మహేష్‌బాబు కెరీర్లో మర్చిపోలేని చిత్రం `దూకుడు`. మహేష్ కామెడీ టైమింగ్ కి అది పరాకాష్ట. ఒకే సినిమాలో మూడు రకాల పాత్రలూ వేయడం అదే తొలిసారి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకుంది. ఆ సినిమా విడుదలై… ఈ రోజుతో పదేళ్లు. దూకుడు లాంటి మ్యాజిక్ మళ్లీ సృష్టించాలన్నది శ్రీనువైట్ల తాపత్రయం. `ఆగడు` చేసినా – అనుకున్న ఫలితం రాలేదు. ఆ ఫ్లాప్‌తో శ్రీనువైట్ల కెరీర్ మసకబారింది. అయితే మళ్లీ కమ్ బ్యాక్ చేయడానికి శ్రీను తహతహలాడుతున్నాడు. మహేష్ కోసం శ్రీనువైట్ల మరో కథ సిద్ధం చేసుకున్నార్ట. త్వరలోనే మహేష్ కి చెప్పి ఒప్పిస్తా అంటున్నాడు శ్రీనువైట్ల.
”దూకుడుకి సీక్వెల్ అని చెప్పలేను గానీ.. ఆ రేంజ్ లో ఓ కథ రాశా. ఇది కూడా మహేష్ కోసమే.అయితే ఇంకాస్త కసరత్తు చేయాలి. అన్ని విధాలా సంతృప్తి ఇచ్చిన తరవాతే…. మహేష్ ని కలిసి కథ చెబుతా.. తను కూడా ఈ కథ విని ఎగ్జైట్ అవుతాడన్న నమ్మకం ఉంద”న్నాడు శ్రీనువైట్ల. తన పరాజయాలపై స్పందిస్తూ…”నాపై కామెడీ ముద్ర బాగా పడిపోయింది. ప్రతీసారీ అదే ఆశిస్తున్నారు. దారి మళ్లీ ఏదో కొత్త కథ చెప్పాలనుకున్నప్పుడు నా ప్రయత్నాలు బెడసి కొడుతున్నాయి. మళ్లీ ఆ తప్పు చేయను. వినోదాత్మకమైన కథలే తీస్తా” అని చెప్పుకొచ్చాడు శ్రీనువైట్ల. ప్రస్తుతం `డీ అండ్ డీ` సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నారాయన. వచ్చే నెలలో షూటింగ్ మొదలెడతార్ట. మూడు నెలల్లో సినిమాని ముగించాలన్నది ప్లాన్.