3 వేల కేజీల హెరాయిన్ !
హైదరాబాద్ జూబ్లిహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఆఫ్రికన్లు, ఇతర పెడ్లర్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి వారి దగ్గర హెరాయిన్ లాంటి డ్రగ్ పట్టుబడితే వారి వద్ద ఉండే పరిమాణం.. ఐదు గ్రామాలు.. పది గ్రాములు మాత్రమే. వాటినే వేలల్లో అమ్ముతూంటారు. అలాంటి 3వేల కేజీల హెరాయిన్ పట్టుబడిందంటే అది చిన్న విషయం కాదు. మామూలు విషయం అసలే కాదు. మొదట 9వేల కోట్ల విలువైన హెరాయిన్ అన్నారు కానీ ఇప్పుడుదాని విలువ రూ. 72వేల కోట్లుగా లెక్కిస్తున్నారు. ఇక్కడ పట్టుబడిన డ్రగ్స్ విలువ కాదు ముఖ్యం. అది ప్రజల్లోకి వెళ్తే డబ్బుతో కొనలేని యువత భవిష్యత్‌ను నిర్వీర్యం చేస్తుంది. అలా జరిగిందంటే ఆ దేశ భవిష్యత్ అంధకారమైనట్లే. అంటే ఆ హెరాయిన్‌కు ఉన్న విలువ కాదు.. వినాశక విలువ.
డ్రగ్స్ వాడకం హీరోయిజం అన్నట్లుగా బిల్డప్ !
దేశ భవిష్యత్తుకు యువత ఎంతో కీలకం. డ్రగ్స్ మత్తులో పడి యువత నిర్వీర్యమైపోయిన దేశాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఎక్కడో ఎందుకు ఒక్క సారి మన దేశంలోనే పంజాబ్ వైపు చూస్తే.. అక్కడ మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడిన అంశాన్ని అవలోకిస్తే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నామో సులువుగా అర్థం చేసుకోవచ్చు. రెండు,మూడేళ్ల కిందట ఉడ్తా పంజాబ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. కానీ అందులో చూపించింది మొత్తం వాస్తవం. ఆ కథలో నిర్వీర్యమైన యువత… దుష్ఫలితాలను వివరించారు. కానీ దాన్ని సినిమాగానే చూశారు. డ్రగ్స్ వాడకాన్ని హీరోయిజంగా చూసే పరిస్థితి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు ఉన్నాయి. డ్రగ్స్ అంటే హెరాయిన్ ఒక్కటే కాదు. విరివిగా దొరికే గంజాయి కూడా డ్రగ్సే. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని సంపాదించటంకోసం ఎంతటి అకృత్యాలు మరియు నేరాలు చేయడానికి వెనుకాడదు. గంజాయి మహమ్మారికి అలవాటుపడితే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. గంజాయికి అలవాటుపడి అది దొరక్కపోతే కాళ్లు, చేతులు వణుకుట, మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి అని అందరికీ తెలుసు. కానీ డ్రగ్స్ తీసుకుంటే నిత్య నూతనంగా ఉండొచ్చని, స్కిన్‌టోన్ మారదని, ముఖంపై ముడతలు రావని, కండలు పెంచవచ్చని ఆశ కల్పిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలు చేస్తున్నారు.
డ్రగ్స్ బానిసలు పెరిగిపోతున్న దేశం భారత్ ..!
ఇటీవల కేంద్రం విస్తృతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలోయువత కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. డ్రగ్స్ ఉచ్చులోకి ప్రధానంగా చేరుతోంది విద్యార్థులే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలో 15 ఏళ్లనుండి 70 ఏళ్ల వయసుగల వారిలో 30కోట్ల మంది ఒక్కసారైనా మాదకద్రవ్యాలను ఉపయోగించారని అంచనా. ప్రతి ఏటా 200 నుండి 300కోట్ల రూపాయల మాదకద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నది. 1985లో నార్కోటిక్ – డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టానె్సస్ చట్టాన్ని భారత ప్రభుత్వం తెచ్చింది. అయినప్పటికీ కొకైన్ డ్రగ్స్ ఇండియాలోకి రావడం తగ్గడం లేదు. దేశంలో గంజాయి వాడేవారు 3.1 కోట్ల మంది, పదేళ్లలో ఓపీయం వినియోగదారుల పెరుగుదల 567 శాతంగా నమోదైంది. గంజాయి, భంగ్, చెరస్ కు బానిసలైన దేశంలో 3.1 కోట్ల మంది ఉన్నారు. యూపీ, పంజాబ్, దిల్లీ, ఏపీ, తెలంగాణ- ఇంజక్షన్ల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యసనపరుల సంఖ్య ప్రాతిపదికన తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల్లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. ఏ కాలేజీ పేరెత్తినా డ్రగ్స్ మహమ్మారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. పేరున్న ఐఐటీలు, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల నుండి యూనివర్సిటీలు చిన్న కాలేజీల వరకు ఈ మత్తు పదార్థాల బెడద ఎక్కువగా ఉంది.
స్మగ్లింగ్ దాటి దిగుమతుల దాకా చేరిన డ్రగ్స్. !
మత్తు పదార్థాల రవాణాకు స్మగ్లర్లు వెదుక్కున్న మార్గాలు తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. గతేడాది విదేశాలనుండి హెరాయిన్ తెచ్చేందుకు ఓ మహిళ పొట్టలోకి మలద్వారం ద్వారా సదరు పాకెట్లను దాదాపు రెండుకిలోలు నొక్కి పంపించారు, విమానాశ్రయంలో ఆ మహిళ, బాధ తట్టుకోలేక పడిపోయింది. ఇది గమనించిన అధికారులు, డాక్టర్లు అసలు విషయాన్ని గుర్తించారు. సూర్య హీరోగా నటించిన ఓ తమిళ సినిమాలో డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేస్తారో చాలా స్పష్టంగా చూపించారు. ఇప్పుడు కడుపులో .. మలద్వారంలో పెట్టుకుని డ్రగ్స్ తెచ్చే స్టేజ్ దాటిపోయింది. ఏకంగా టన్నులకు టన్నులు దిగుమతుల స్థాయికి వచ్చింది. మత్తు పదార్థాల బారిన పడేది కొందరు వ్యక్తులే కావచ్చు కాని వారి ప్రభావం సమాజంపై అత్యంత దారుణంగా ఉంటుంది.
వ్యవస్థల వైఫల్యం !
ఆప్ఘన్ కంటెయినర్లను పట్టుకోక ముందే గుజరాత్ తీరం సమీపంలో ఇరాన్ పడవనొకదాన్ని పట్టుకున్నారు. అందులో దొరికిన హెరాయిన్ విలువ సుమారు రూ.250కోట్లు. ఇప్పుడు గుజరాత్‌లోనే ముంద్రా నౌకాశ్రయంలో దొరకిన హెరాయిన్ కథ ఇంకా తేలలేదు. దొరింది మాత్రమే కాదు ..దేశంలోకి ప్రవేశించింది ఎంతో ఉందని చెబుతున్నారు. టాల్కం పౌడర్ పేరిట అఫ్గాన్ నుంచి వచ్చిన 25 టన్నుల హెరాయిన్ దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు తరలిపోయినట్లు ఆలస్యంగా బహిర్గతమైంది. క్షేత్రస్థాయిలో గ్రాముల లెక్కన చేతులు మారే హెరాయిన్ టన్నులకొద్దీ పరిమాణంలో దేశంలోకి వచ్చిపడుతూ, ప్రధానంగా యువతను నిర్వీర్యం చేస్తోందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. విశాఖ మన్యం నుంచి ప్రతీ రోజూ పదుల సంఖ్యలో వాహనాలు గంజాయి రవాణా చేస్తూ ఉంటాయి. అక్కడి గంజాయి మాఫియా ఏటా రూ.7200 కోట్ల మేర వ్యాపారం చేస్తున్నట్లు అంచనా. కానీ అడ్డుకోవడంలో ఎప్పటికప్పుడు ఘోర వైఫల్యం కనిపిస్తూనే ఉంది.
ఆ దేశాలకు తెలుసు కాబట్టే డ్రగ్స్ అంటే మరణ శిక్షలు !
డ్రగ్స్ వినియోగించినా, ఉత్పత్తి నిల్వ వ్యాపారాలకు పాల్పడినా కంబోడియా, వియత్నాం, సింగపూర్, థాయ్‌లాండ్ వంటివి మరణదండన విధిస్తున్నాయి. బానిసలైన వారిని కాపాడేందుకు కాంబోడియా, వియత్నాం, మెక్సికో, సింగపూర్, థాయ్‌లాండ్ లాంటి దేశాల ప్రభుత్వాలు బాధితుల పునరావాసంకోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. కొన్నాళ్ల కిందట అమెరికా ఎఫ్‌బీఐ 16 దేశాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 800 మందికి పైగా అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని టన్నులకొద్దీ సరకును స్వాధీన పరచుకుంది. అదే ఇక్కడ పాత్రధారులు కొంతమంది వలలో చిక్కుతున్నా, సూత్రధారులు తప్పించుకుంటున్నారు. మాదకద్రవ్యాలు ఎంత వినాశనమో అందరికీ తెలుసు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో పాలకులకే తెలియాలి !
ఇక్కడ రాజకీయ స్వార్థాలు చూసుకుంటే నేతలవరు రాక్షసులే !
దేశంలో ఇప్పటికే ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు రాజకీయ పార్టీలు.. పాలకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు నియంతృత్వం దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. అలా ఎన్ని చేసినా డ్రగ్స్ విషయంలో మాత్రం అన్నింటినీ వదిలేసి అత్యంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. భావి భారత పౌరులు వీటి బారిన పడితే దేశ భవిష్యత్తే నాశనం అవుతుంది. ప్రబుత్వాలు తల్చుకుంటే అడ్డుకోవడం పెద్ద విషయం కాదు. కానీ విదేశాలనుంచి దిగుమతి అవుతున్న వాటిని ఎందుకు నిలువరించలేకపోతున్నారు? అసలు లొసుగు ఎక్కడున్నది? ఏదో ఓ పవర్ ఫుల్ వ్యవస్థలోని వాళ్ల సాయం లేకపోతే ఈ దిగుమతులు సాధ్యమేనా ? . పాలకులే ఆలోచించి ఈ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించాలి. మూల కారణం ఎవరో గుర్తించి నిర్మూలిస్తేనే ప్రయోజనం అంతే కానీ అక్కడ కొద్దిగా.. ఇక్కడ కొద్దిగా డ్రగ్స్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తే అది దేశానికే ప్రమాదం .