ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై చాలా పాత కేసులు ఉన్నాయి. ఇంకా పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేయించారు. వాటికి ఆధారాలు ఉన్నాయా లేవా అన్నది తర్వాత సంగతి ..ముందు అరెస్ట్ చేసేశారు. ఒక కేసులో రిమాండ్ ముగిసి బెయిల్ వస్తుందనుకుంటున్న సమయంలో మరో కేసులో అదుపులోకి తీసుకునేవాళ్లు. ఇలా జైల్లోనే దాదాపుగా మూడు నెలలు గడిపాడు చింతమనేని ప్రభాకర్. ప్రస్తుతం ఇదే పరిస్థితి తెలంగాణలో తీన్మార్ మల్లన్నకు ఎదురవుతోంది.
రాజకీయంగా ఎదుగుతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ క్యూ న్యూస్ చానల్ నిర్వహిస్తున్నారు. ఆయన బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న పేరుతో వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ముందుగా నెలరోజుల క్రితం జ్యోతిష్యుడు లక్ష్మీకాంతశర్మ ఐదు నెలల కిందట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో ఉన్న కేసుల్లోనూ అరెస్టులు చూపిస్తున్నారు. తాజాగా బెయిల్ వచ్చిందన్న ప్రచారం నేపధ్యంలో ఆయనపై నిజామాబాద్‌లో మరో కేసులో అరెస్ట్ చూపించారు.
పాదయాత్ర పేరుతో మల్లన్న తనని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఓ కల్లు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఏ -5గా ఉన్న తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని రాత్రి నిజామాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. తీన్మార్ మల్లన్న బయట ఉంటే ప్రతి రోజూ ఉదయం న్యూస్ పేపర్ ఎనాలసిస్ చేస్తూ ఉండేవారు. ఆ ప్రోగ్రాంకు లక్షల మంది వ్యూయర్స్ ఉన్నారు. అలాగే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసేవారు. అదే సమయంలో రాజకీయంగా భారీ పాదయాత్రలు చేపట్టాలన్న ప్రణాళికలు వేసుకున్నారు. అరెస్టుతో అవన్నీ పక్కన పడినట్లు అయ్యాయి.