డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ సీరియల్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం అందర్నీ ప్రశ్నించారు. అయితే విచారణ సీరియల్ రెండో సీజన్ లేదని కూడా ఈడీ వర్గాలు అనధికారికంగా మీడియాకు లీకులిచ్చాయి. ఎందుకంటే మొదటి విడతలో వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదట. కెల్విన్‌తో పాటు ఇతర డ్రగ్ పెడ్లర్లను పిలిపించి ఎదురెదురుగా కూర్బోబెట్టి ఆర్థిక లావాదేవీల గురించి కూపీ లాగినప్పటికీ అసలు ఎలాంటి ఆధారం దొరకలేదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులకు ఎలాంటి టెన్షన్ లేకుండా పోయింది.
ఈడీ విచారణ జరుపుతున్న సమయంలోనే తెలంగాణ ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2017లో వారిని ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ వారి శాంపిళ్లను కూడా తీసుకుంది. వాటిలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని కోర్టుకు తెలిపింది. అదేసమయంలో కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని తేల్చేశారు. దీంతో ఈడీకి కూడా ఏం చేయాలన్నదానిపై క్లూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు.. డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించాలని తాము ఎలా నిరూపించాలన్న ఇబ్బంది ఈడీ వచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి రాజకీయంగానూ కలకలం రేపిన తెలంగాణ డ్రగ్స్ కేసులోకి హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఈడీ అంతే వేగంగా బయటకు వెళ్లిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. లేని పోని టెన్షన్లకు గురైన సినీ తారలు.. ఇతర ప్రముఖులు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. మళ్లీకొత్త ఆధారాలు ఏమైనా దొరకకపోతే.. ఈడీ నుంచి ఎలాంటి అప్ డేట్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.