ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన స్థానిక నాయకత్వం పొత్తులు పెట్టుకుని కొన్ని చోట్ల సమన్వయంతో కలిసి పని చేసి మంచి ఫలితాలు సాధించాయి. కడియం, ఆచంట వంటి చోట్ల విజయాలు సాధించారు. మండల పరిషత్ చైర్మన్ పదవుల విషయంలోనూ ఈ రెండు పార్టీలు కలసి పని చేశాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో రెండు పార్టీల నేతలు పొత్తులు పెట్టుకుని పోటీచేయడమే కాకుండా ఎంపీపీ చైర్మన్ విషయంలోనూ అదే అవగాహనకు వచ్చారు. చైర్మన్ పీఠాన్ని టీడీపీ, వైస్ చైర్మన్ పీఠాన్ని జనసేన తీసుకున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనూ టీడీపీకి జనసేన మద్దతివ్వాలని నిర్ణయించుకుంది.
ఈ పరిణామాలను వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజకీయాల్లో మార్పుల కోణంలో ఆవిష్కరిస్తున్నారు. అక్కడ స్థానిక నాయకత్వం కలసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని ఉండవచ్చు కానీ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు పార్టీలు అవగాహనకు వస్తే రాజకీయాలు మారిపోతాయని ఆయన అంటున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రెండు, పార్టీలు కలిస్తే మంచి పలితం ఉంటని విశ్లేషించడానికి చాలా కారణాలు చెప్పారు. భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు ఏమాత్రం కలసి రావడం లేదని తిరుపతి ఉపఎన్నిక సహా అనేక అంశాలు తేల్చేశాయి.
జనసేన బలాన్ని తమ బలంగా చెప్పుకోవడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రభుత్వంపై పోరాటానికి ప్రయత్నించడం లేదన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ విధానంలో ఏమైనా మార్పు తెస్తాయా అన్న చర్చ తాజా ఆచంట ఫలితంతో ప్రారంభమైంది.