స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. చివరికి మండలాధ్య పదవుల ఎన్నికలు కూడా ముగిశాయి. అంతా అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కంటే ఎక్కువగా జరుగుతున్న చర్చ టీడీపీ – జనసేన కలవడం గురించే. ఈ రెండు పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకోలేదు. స్థానిక నేతలు ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో నేతలు ఎక్కడివక్కడ సర్దుబాటు చేసుకుని మంచి ఫలితాలు సాధించారు. అధికారికంగా తాము కలిసి పోటీ చేశామని బీజేపీ – జనసేన ప్రకటించుకున్నాయి. కానీ స్థానిక స్థాయిలో అలాంటి పొత్తులు ఉన్నాయని అటు బీజేపీ నేతలు కానీ ఇటు జనసేన క్యాడర్ కానీ భావించలేదు. అయితే అధికారికంగా పొత్తు మాత్రం ఉంది.
కానీ టీడీపీ – జనసేన స్థానిక నేతలు పొత్తులు పెట్టుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయి. ఇది రెండు పార్టీల నేతల్ని ఆలోచనలలో పడేస్తోంది. బీజేపీతో కలిసి ఉండటం వల్ల జనసేనకు వచ్చే ప్లస్ పాయింట్లేమీ లేకపోగా మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే టీడీపీతో కలిస్తే ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఫీలింగ్ వస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఫలితాలు జనసేన చీల్చిన ఓట్లతో మారిపోయాయి. అదే సమయలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ ఎలాగూ గెలవదన్న కారణంగా ప్రత్యామ్నాయంగా ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఉన్నారు. ఖచ్చితంగా జనసేనకు లాభిస్తుంది అనుకున్నప్పుడు ఆ పార్టీకి ఓటు వేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహనా లేమి కారణంగానే మరో లెక్కతోనే కానీ టీడీపీకి అకారణంగా దూరమయ్యారు. ఆయనకు టీడీపీ ఇచ్చిన గౌరవం.. ఇప్పుడు లభిస్తున్న గౌరవం.. ఆయన ఆర్థిక మూలాలలపై దెబ్బకొట్టే ప్రయత్నాలపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చి ఉంటుంది. అందుకే అందరూ టీడీపీ – జనసేన కలవాలనే సలహాలు ఇస్తున్నారు. ఈ అంశంలో పవన్ కల్యాణ్ ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ.. రాజకీయాలు మాత్రం వేగంగా మారిపోతున్నాయి.
ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీని ఓడించి వైసీపీని గెలిపించాలంటే బీజేపీతోనే కలిసి ఉండాలని లేకపోతే.. వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న భావనలో ఉంటే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్న సలహాలు జనసేనానికి వెళ్తున్నాయి. దీనిపై ఆయనే ఏ నిర్ణయం అయినా తీసుకోగలరు.