తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాము చేసిన పనులను మీడియా చెప్పినా దుష్ప్రచారం .. కేసులు పెడుతామంటూ హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను జియో మార్ట్ ద్వారా అమ్మడం నిజం. టీటీడీ వెబ్ సైట్‌ను క్లిక్ చేస్తే జియో మార్ట్‌కు మైగ్రేట్ అవడం కూడా నిజం. టీటీడీ అధికారులు చెప్పినట్లుగా కోటి మంది టిక్కెట్ల కోసం ప్రయత్నించారు. అంటే టీటీడీ భక్తులకు తమకు అవసరం లేకపోయినా జియో మోర్ట్ వెబ్ సైట్‌ను కోటి సార్లు ఓపెన్ చేశారు. టీటీడీ తమ భక్తులను ఇలా జియో మార్ట్‌కు అప్పగించిందని విమర్శలు వచ్చాయి.
దీన్ని టీటీడీ పాలనాధికారులు ఖండించారు. దుష్ప్రచారం చేస్తున్నారని కేసులు పెడుతామని చెప్పుకొచ్చారు. నిజంగానే జియో మార్ట్ కు టిక్కెట్ల బాధ్యత అప్పగించినట్లుగా ఒప్పుకున్నారు. మరి ఏమని కేసులు పెడుతారు. ఎందుకు ఇచ్చారంటే శ్రీవారి భక్తులు ఉచితంగా సేవ చేస్తామంటే ఇచ్చామని చెబుతున్నారు. కోటి మంది శ్రీవారి భక్తుల్ని జియోమార్ట్ ఖాతాదారులుగా మార్చేసిన టీటీడీ… వారు ఉచిత సేవ చేస్తారంటే ఎవరు నమ్ముతారు. శ్రీవారి భక్తుల ఫోన్ నెంబర్లు.. ఏకంగా కోటి జియోమార్ట్ డేటాలో చేరిపోలేదా ?. ఇంకా క్లౌడ్ సేవలు.. రూ. మూడు కోట్లు అని టీటీడీ అధికారులు కబుర్లు కాస్త విలువవైనవే చెబుతున్నారు.
కానీ అలా ఇవ్వడానికి కూడా ఓ పద్దతి ఉంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అయితే తమ తప్పిదాలు.. స్కాంలను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేసి కేసులు పెట్టడం అన్న ఒకే ఒక్క ఆప్షన్‌ను ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నారు. అదే బెదిరింపులకు దిగుతున్నారు. చేసింది చెప్పినా దుష్ప్రచారం అంటున్నారంటే ఖచ్చితంగా వారు చేసిందని తప్పని వారు అంగీకరించడమనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.