పవన్ కల్యాణ్ అనే పేరుకు పవర్ స్టార్ అనేది పర్యాయ పదంగా మారిపోయింది. పవర్ స్టార్ అని పిలిస్తే చాలు.. అభిమానులకు పూనకాలు వచ్చేస్తుంటాయి. అయితే తన పేరు ముందు `పవర్ స్టార్` అనే పదాన్ని తీసేయమని.. దర్శక నిర్మాతలకు పవన్ ఆదేశాలిచ్చారు. అందుకే `భీమ్లా నాయక్` టీజర్లో, పోస్టర్లలో పవర్ స్టార్ అనేది కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆయన ఉత్తి.. పవన్ కల్యాణే.
`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి.. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ `పవర్ స్టార్` జపం చేశారు. సుమ కూడా పవన్ ని వేదికపై `పవర్ స్టార్` అంటూనే ఆహ్వానించింది. దాంతో పాటుగా అభిమానులు కూడా `సీఎం..సీఎం` అంటూ నినదించారు. దాంతో పవన్ పవర్ స్టార్ పై కూడా స్పందించాల్సివచ్చింది. `పవర్ లేని వాడికి పవర్ స్టార్ ఎందుకయ్యా.. తీసేయండి` అని నవ్వుతూనే తనపై తాను సెటైర్ వేసుకున్నారు. నిజానికి పవన్ ప్రత్యర్థులు అనాల్సిన మాట. ఎవరో అనడం ఎందుకు? అని తనపై తానే జోక్ వేసుకున్నాడు పవన్. తెరపై పవర్ స్టార్ అనే పదం తొలగించడం మంచి మార్పే. అదెందుకు అనేది బాహాటంగా ఒప్పుకునే విషయంలోనూ పవన్ మార్కులు కొట్టేసినట్టైంది.