సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వార్త చాలా టీవీ ఛానళ్లకు కొన్ని రోజుల పాటు ఫుటేజీని అందించింది. జరిగిన ప్రమాదం కంటే – అనవసరమైన హంగామాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి టీవీ ఛానళ్లు. బైకు స్పీడు దగ్గర్నుంచి బైకు మోడల్, దాని రేట్.. ఇలా న్యూస్ పక్క దారి పట్టి, మార్కెటింగ్ వ్యవహారంలా మారిపోయింది. ఓ టీవీ ఛానల్ అయితే.. సాయిధరమ్ తేజ్ ఇంటికెళ్లి మరీ… `ఇక్కడి నుంచే సాయిధరమ్ తేజ్ తన బైక్ ని బయటకు తీశాడు` అంటూ… ఎవ్వరికీ అక్కర్లేని హంగామా చేసింది. అక్కడితో ఆగలేదు. ఓవర్ స్పీడు, నిర్లక్ష్యం అంటూ వార్తలు దంచికొట్టింది. ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కూడా అయ్యాయి.
ఇప్పుడు వీటన్నింటిపైనా పవన్ కల్యాణ్ తనదైన స్టైల్ లో కౌంటర్ వేశారు. రిపబ్లిక్ ప్రీరిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా టీవీ ఛానళ్ల వైఖరిపై గళం విప్పారు. సాయిధరమ్ తేజ్ పై కనికరం చూపించాల్సిన సమయంలో – ఓవర్ స్పీడు, నిర్లక్ష్యం అంటూ వార్తలు దంచికొట్టిన విషయం తన వరకూ వచ్చిందని, అవన్నీ తనని బాధించాయని పేర్కొన్నారు. `తప్పులు జరుగుతాయి.. మీ ఇళ్లల్లో జరగవా..` అంటూ నిలదీశారు. దీని కంటే ముఖ్యమైన వార్తలు కొన్ని ఉన్నాయని, అవి మరింత స్పైసీగా కూడా ఉంటాయని, వీలైతే వాటిపై దృష్టి పెట్టాలని ఛానళ్లకు కౌంటర్లు వేశారు. వివేకానంద హత్య గురించి, ఆరేళ్ల బాలికపై జరిగిన అన్యాయం గురించీ, వ్యభిచారాన్ని ప్రోత్సహించిన వైకాపా నాయకుల గురించీ, కోడి కత్తి గురించి వార్తలు ప్రసారం చేస్తే ఇంకా స్పైసీగా ఉంటుందని, వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఉందని, ఈ దిశగా ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు పవన్ కల్యాణ్.