ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా రిటైరవుతున్న వారందరికీ మళ్లీ జీతాలిచ్చే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా రిటైరవుతున్న ఆదిత్యనాథ్ దాస్‌కూ అలాంటి వెసులుబాటు ఇచ్చింది. ఆయనకు సలహాదారు పదవి ఇచ్చింది. ఏం సలహాలిస్తారో తెలియదు కానీ ఆయన విజయవాడలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబంతో సహా ఢిల్లీలోనే ఉండొచ్చు. అసలు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు. జీతాలు మాత్రం ఠంచన్‌గా ఆయన ఖాతాలో పడే ఏర్పాటు చేశారు. కేబినెట్ హోదాలో వచ్చే పదవులు కాబట్టి ఇక సౌకర్యాలకు కొదవేమీ ఉండదు. ఒక్క రోజు గ్యాప్ లేకుండా ఇలా పదవి విరమణ చేసిన రోజునే అలా పదవిలోకి దాస్ వచ్చేస్తున్నారు.
గతంలో నీలం సహానిని కూడా ఇలాగే గౌరవించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆమె చేసిన సేవలకు గుర్తుకు పదవి విరమణ చేసిన వెంటనే సలహాదారు పదవి ఇచ్చారు. అయితే ఆమె ఇంకా గొప్పగా సేవలు చేశారు కాబట్టి ఉన్నతమైన పదవి ఇవ్వాలని నిర్ణయించి ఎస్ఈసీ పదవి ఇచ్చేశారు. ఒక వేళ ఆమె పదవిలో ఉన్నప్పటికీ దాస్‌కు వచ్చే ఇబ్బందేమీ ఉండేది కాదు. ఎందుకంటే ఎంత మందికైనా ప్రజాధనాన్ని సలహాదారలకు ఇచ్చే అధికారం ప్రభుత్వాన్ని.. సీఎం జగన్‌కు ఉంది. ప్రస్తుతం సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న సమీర్ శర్మ నవంబర్ వరకు మాత్రమే సీఎస్‌గా ఉంటారు. అప్పుడు ఆయనకూ ఓ సలహాదారు పదవి రెడీగా ఉండే అవకాశం ఉంది.
సీఎస్ రేంజ్లో పని చేసినా… సలహాదారులంటే ఏపీలో ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. అదో రూల్. సలహాదారులందరికీ సూపర్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన చెప్పిందే వేదం. ఆయిన ఇచ్చిందే సలహా. ఎప్పుడైనా ప్రెస్నోట్లు పంపితే వాటి మీద మేధావుల కోటాలో సంతకాలు పెడితే మీడయాలో ప్రచారం చేసుకుంటారు. గతంలో చంద్రబాబు హయాంలో సీఎస్‌గా చేసిన అజేయకల్లాంను చంద్రబాబు సలహాదారుగా పెట్టుకోలేదు కానీ ఎన్నికలకు ముందే ఆయన సేవలను వాడుకుని ఎన్నికల తర్వాత సలహాదారు పదవి ఇచ్చారు.