నగరి నియోజకవర్గంలో రోజా ఇమేజ్ను మసక బార్చేందుకు పెద్దిరెడ్డి వర్గం చాలా ప్లాన్డ్ గా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఏడేళ్లుగా ఉంటున్నప్పటికీ పెద్దరెడ్డి వర్గీయులు వైసీపీలో సమాంతర నాయకత్వాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి మండలంలో వైసీపీ నేతలు రోజా వర్గంతో పాటు పెద్దిరెడ్డి వర్గంగా విడిపోయారు. ఆ విషయం మండల పరిషత్ ఎన్నికల్లో తేలిపోయింది. మండల అధ్యక్ష పదవుల్లో పార్టీ అంగీకారం మేరకు తన వారిని రోజా నిలబెడితే.. పెద్దిరెడ్డి వర్గం పోటీగా బరిలోకి నిలిచింది. ఇలా నిండ్ర మండలంలో జరిగిన రచ్చను మీడియాలో హైలెట్ చేయడంలోనూ సక్సెస్ అయింది.
నిండ్ర మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. నిండ్ర ఎంపిపి స్థానానికి ఎమ్మెల్యే ఆర్కే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రపాణి రెడ్డి మాత్రం తన తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు నిర్వహించారు. రోజా వర్గంలో నలుగురే ఉన్నారు. దీంతో రోజా స్వయంగా సమావేశానికి హాజరై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. టీడీపీ ఎంపీటీసీని డిస్ క్వాలిఫై చేయించి అభ్యర్థిని గెలిపించుకున్నామని .. ఆమె కొన్ని నిజాలు బయట పెట్టేశారు.
అదేసమయంలో పార్టీ విషయంలో ఆమె దారుణంగా వ్యవహరిస్తున్నాని.. పరువు తీస్తున్నారన్న అభిప్రాయం కల్పించేందుకు వీడియోలను విపరీతంగా హైలెట్ చేశారు. దీంతో రోజా ఇమేజ్ మసకబారే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితి కొన్నాళ్లుగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు నగరిలో అన్ని మండలాల్లో ఉండటంతో రోజా మాటలు వారు వినడం లేదు. దాంతో ఆమె ప్రతీ సారి అసహనానికి గురవుతున్నారు.