మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. మణిరత్నం లాంటి దిగ్దర్శకుల కితాబులు అందుకుంది. మంచి పాత్రలు ఆమెని వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఇప్పుడు తెలుగులో ‘రిపబ్లిక్’ సినిమా చేసింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా రిపబ్లిక్ కబుర్లు ముచ్చటించింది. ఆ విశేషాలు ఇవే.
‘రిపబ్లిక్” అవకాశం ఎలా వచ్చింది ?
దర్శకుడు దేవకట్టా నేరుగా ఫోన్ చేశారు. మైరా అనే పాత్ర వుంది. వింటారా ? అని అడిగారు. దాదాపు గంట చెప్పారు. బాగా నచ్చింది. తర్వాత దాదాపు నేరుగా కలసి ఐదు గంటలు పాటు పాత్ర గురించి వివరంగా పాయింట్ టు పాయింట్ చెప్పారు. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ కూడా పెట్టారు. చాలా విజన్ వున్న దర్శకుడు . పెర్ఫక్షనిస్ట్. షూటింగ్ 22 రోజులు పాల్గొన్న. కానీ డబ్బింగ్ కి 15 రోజులు పట్టింది. అంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన ఎంత పెర్ఫక్షన్ కోరుకుంటారో. ఆయనతో వర్క్ చేయడం గుడ్ ఎక్స్పీరియన్స్.
రిపబ్లిక్ సినిమా ఎలా ఉండబోతుంది ?
మంచి కంటెంట్. చాలా పొలిటికల్ డ్రామాలు వచ్చాయి. కానీ రిపబ్లిక్ వాటికి భిన్నంగా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు. తెలుగు తెరకు ఖచ్చితంగా కొత్తగా వుంటుంది.
షూటింగ్ ఎలా గడిచింది ? తేజుతో పని చేయడం గురించి ?
దేవాకట్టా చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయనకి కావల్సిన ఫెర్ఫార్మెన్స్ యాక్టర్ దగ్గర నుంచి చక్కగా రాబట్టుకునే నేర్పు వున్న దర్శకుడు. ఆయనతో పని చేయడం మంచి లెర్నింగ్. తేజు నాకు హీరోగా కంటే స్కూల్ పిల్లాడిలా అనిపించింది. ఒక కమర్షియల్ హీరో అయ్యిండి ఆ ఇమేజ్ ఏమీ లెక్కలు వేసుకోకుండా ఒక చిన్న పిల్లాడిలా నోట్స్ రాసుకొని డైలాగ్స్ ని నేర్చుకొని ఇంప్రవైజ్ చేసుకునే విధానం చాలా నచ్చింది. చాలా కష్ట పడ్డాడు. నిజంగా మీరు కొత్త తేజుని చూస్తారు.
తేజుని చూశారా ?
లేదండీ. ఎవర్నీ హాస్పిటల్ లోకి రానివ్వడం లేదు.
తెలుగులో నటనకి ఆస్కారం వున్న పాత్రలు రావనే విమర్శ వుంది దీనిపై… మీ కామెంట్ ?
లేదు. ఇప్పుడు చాలా మారింది. మొన్న దర్శకుడు బుచ్చిబాబుని కలిసా. నా వర్క్ ని మెచ్చుకున్నారు. నాతో వర్క్ చేయాలని వుందని చెప్పారు. ఆయనే కాదు.. చాలా మంది దర్శకులు ఇప్పుడు కంటెంట్ వున్న కధలతో వస్తున్నారు.
కమర్షియల్ హీరోయిన్స్ పై మీ కామెంట్ ?
– కమర్షియల్ హీరోయిన్స్ అని వుండరు. ఇక్కడ అల్టీమేట్ గా ఫెర్మార్మెన్స్ చూస్తారు. కృతిశెట్టి ఒక్క సినిమాతో స్టార్ అయ్యింది. సాయి పల్లవి కూడా. మంచి ఫెర్మార్మెన్స్ కనబరచడమే కమర్షియాలిటీ.
మీకు నచ్చిన హీరోయిన్స్
– నాకు సౌందర్య గారు అంటే పిచ్చి. సమంత, అనుష్క ఇష్టం.
శివగామి రమ్యకృష్ణ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
– అమ్మో.. ఆమెలో ఇద్దరు వున్నారు. యాక్షన్ చెప్పినపుదు ఒకరు, కట్ చెప్పిన తర్వాత మరొకరు. ఆమె పాత్రలో కి వెళ్ళిపోయే విధానం అమేజింగ్. ఇంత ఎక్స్ పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక సీన్ చేసి ఎలా చేశానని చిన్నపిల్లలా అడుగుతారు. లొకేషన్ లో ఆమె వుంటే మంచి సందడిగా వుంటుంది. బ్యూటీఫుల్ యాక్టర్.
ఓటీటీ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?
– ఓటీటీలో కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్స్సప్ట్ చూసే అవకాశం వుంది. ఐతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు సినిమాకి థియేటర్ ఇచ్చే అనుభవం మరొకటి ఇవ్వలేదు. అంతపెద్ద స్క్రీన్ లో సినిమాని ఎక్స్ పీరియన్స్ చేయడం గొప్ప అనుభూతి. ఆ అనుభూతికి మరో ప్రత్యామ్నాయం లేదు.
కొత్త సినిమా కబుర్లు ?
– తెలుగులో ‘గతం’ సినిమా దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న. ఇంకొన్ని కధలు వింటున్న. తమిళ్ లో కొన్ని సినిమాలు షూటింగ్ లో వున్నాయి.
ఆల్ ది బెస్ట్
– థ్యాంక్ యూ..