అనంతపురం జిల్లాలో ఐరన్ ఓర్ గనులతో బంగారం పండించారని చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు నిజంగానే అనంత జిల్లాలో బంగారం గనులు ఉన్నాయని బయటపడింది. వాటిని తవ్వుకునేందుకు ఏపీ ప్రభుత్వం లైసెన్స్‌లు మంజూరు చేయాలని కూడా నిర్ణయించింది. అనంతపురం జిల్లాలో పది చోట్ల బంగారం గనులు ఉన్నట్లుగా గనుల శాఖ గుర్తించింది. రామగిరి, రొద్దం, బొక్సంపల్లి, జౌకుల వంటి చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించి తవ్వకాలకు కాంపొజిట్ లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయించారు.
మొదట భూమి నుంచి యాభై మీటర్ల వరకూ తవ్వాలి. ఆ యాభై మీటర్ల వరకూ ఎలాంటి బంగారం బయట పడదు. ఆ తర్వాత దిగువకు వెళ్లే కొద్దీ బంగారం ఉంటుంది. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల బంగారం ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ తవ్వకాలు జరిపి బంగారం వెలికి తీస్తే.. 16 టన్నుల బంగారం వెలుగులోకి వస్తుందని నిర్ణయించారు. భూగర్భ గనుల కేటగిరిలోకి వీటిని చేర్చి తవ్వకాలు చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి వనరులు ఉన్నాయో ఇటీవల కేంద్ర జియోలాజికల్ విభాగం గుర్తించి .. ాష్ట్రానికి నివేదిక అందించింది. కడపలో వజ్రాల గనులు ఉన్నట్లుగా తేల్చారు.
కేంద్రం ఇచ్చిన వాటితో కొత్తగా రాష్ట్రం బంగారం నిక్షేపాల ప్రాంతాలకు కూడా కాంపోజిట్ లైసెన్సు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో వ్యక్తి లేక సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు ఈ లైసెన్సు ఇస్తారు. కాంపొజిట్ లైసెన్స్ అంటే ప్రధానంగా అన్వేషణ కోసమే. పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాలు గుర్తించిన చోట మైనింగ్ లీజు కేటాయిస్తారు. అయితే ఏ లైసెన్స్ అయినా ఒకటే పనిగా తవ్వుకోవడం మన వాళ్లకు అలవాటే కాబట్టి మిగతా లైసెన్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. అనంతపురం జిల్లాలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్‌కు గనులు ఉండేవి. వీటిలో 2001 నుంచి తవ్వకాలు నిలిపేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నారు.