ఏపీ సరిహద్దుల్లో తనిఖీలు తీవ్రం చేయాలని డీఆర్ఐ అధికారులు తెలంగాణకు సూచించారు. ఆ మేరకు వారు తనిఖీలు ముమ్మరం చేయడంతో సరిహద్దుల్లో ముఖ్యంగా ఏపీ నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాల్లో గంజాయి పట్టుబడుతోంది. ఇలా ఓ వాహనంలో తరలిస్తున్న 60కేజీల గంజాయిని తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంత మందిని అరెస్ట్ చేశారు. అయితే అలా తరలిస్తూ పట్టుబడిన వారిలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ఉన్నాడంటూ ఒక్క సారిగా పుకారు చెలరేగింది. దాంతో ఆయన తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఓ వీడియో విడుదల చేశారు.
దీనిపై టీడీపీ అధినేత ప్రతినిధి పట్టాభిరాం ప్రెస్‌మీట్ పెట్టి అక్కడ దొరికింది ఆయన కుమారుడేనని దమ్ముంటే చెక్ పోస్ట్ వద్ద సీసీ టీవీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంతే కాదు లాబీయింగ్ చేయించుకుని కొడుకును కేసు నుంచి బయటకు తెప్పించారని.. డ్రగ్స్‌తో సంబంధం లేకపోతే టెస్టులకు రావాలని సవాల్ చేశారు. దీనిపై ఉదయభాను మండిపడ్డారు. తనపై పోటీ చేసిన వారు సవాల్ చేయాలని పట్టాభి చేయడం ఏమిటని ఆయన తిట్లతో విరుచుకుపడ్డారు. తనకు.. తన కుమారుడికి లిక్కర్.. డ్రగ్స్ బిజినెస్‌లతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. పరువు నష్టం కేసులు వేస్తానన్నారు.
మరో వైపు ఏపీలో బయటపడిన అషి ట్రేడింగ్ కంపెనీ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఆ కంపెనీ పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంది. ప్రతీ నెలా జీఎస్టీ చెల్లించింది. అంటే సరుకును ఇక్కడకు తీసుకొచ్చినట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు. ఆ జీఎస్టీ బిల్లుల రికార్డులను టీడీపీ వెల్లడించింది. ఆషి ట్రేడింగ్ కంపెనీ ఓనర్ .. ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ డాన్ ఎవరు అని ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది ముందు ముందు అనేక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.