సెకండ్ వేవ్ తరవాత…. టాలీవుడ్ కి `లవ్ స్టోరి` రూపంలో పెద్ద హిట్ దొరికింది. కమర్షియల్ గా తొలి మూడు రోజులూ… లవ్ స్టోరి తన స్టామినా చూపించగలిగింది. నాగచైతన్య కెరీర్లో ఇదే పెద్ద హిట్. అయితే నిజానికి ఈ కథ చైతూ వరకూ రావడానికి చాలా మలుపులు తిరిగింది. నిజానికి శేఖర్ కమ్ముల రాసుకుంది నాగచైతన్య కోసం కాదు. కొత్త వాళ్లతో, తన పంథాలో ఓ సినిమా చేయాలని ఆయన భావించారు. హీరో హీరోయిన్లుగా కొత్త వాళ్లని పరిచయం చేస్తూ… లవ్ స్టోరీ సినిమాని దాదాపు మూడొంతులు పూర్తి చేశాడు. ఆ తరవాత ఫుటేజీ చూసుకోవడం, అంత సంతృప్తిగా అనిపించకపోవడం, తెలిసిన మొహాలతో ఈ సినిమా బాగుంటుందని అనిపించడంతో కొంతమంది హీరోలకు ఈ కథ వినిపించాడు. అందులో భాగంగానే లవ్ స్టోరి వైష్ణవ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. శేఖర్ కమ్ములతో పనిచేయాలని ఎవరికి మాత్రం ఉండదు? వైష్ణవ్ కూడా ముందు ఉత్సాహపడినా, ఆ తరవాత ఆలోచించాడు. ఉప్పెన కూడా కులాంతర ప్రేమ కథే. వరుసగా రెండో సినిమా కూడా అలాంటి కథతో చేయడం సరైంది కాదనిపించింది. అందుకే శేఖర్ కమ్ముల ఆఫర్ ని ఆయన సున్నితంగా తిరస్కరించాడు. దాంతో ఈ కథ చైతూ దగ్గరకు వెళ్లింది. విన్న వెంటనే చైతూ ఒప్పేసుకోవడం, నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ కథ చైతూ దగ్గర ఆగింది.