ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ఏమైంది ? ఏ దశలో ఉంది? .. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసిచాలా కాలం అయింది. కనీసం పునాదులు అయినా వేస్తున్నారో లేదో స్పష్టత లేదు. కానీ మరో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన దూసుకొచ్సేసింది. ఈ సారి ఈ చాన్స్ హైదరాబాద్‌కు ఇచ్చారు. హైదరాబాద్-ముంబయి మధ్య బుల్లెట్/హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే సర్వే కూడా ప్రారంభించింది. భూసేకరణ ఎంత చేయాలో . ఎలా చేయాలో లెక్కలు తీస్తోంది.
హైదరాబాద్-ముంబయిల మధ్య దూరం 650 కి.మీ. రోడ్డు మార్గం ద్వారా చేరుకోవాలంటే 14 గంటల సమయంపడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. హైదరాబాద్-ముంబయి మధ్య మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల భూభాగాల్లో మొత్తం 11 స్టేషన్లు ఉంటాయని కేంద్ర అధికారులు మహారాష్ట్ర అధికారులకుతెలిపారు. ఈ అంశంపై తెలంగాణ అధికారులకు సమాచారం ఉందో లేదో స్పష్టత లేదు. అయితే తెలంగాణతో సంప్రదింపులు జరపకుండా బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.
ముంబై – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఎక్కడా పెద్దగా లేదు. గతంలో కేటీఆర్ బుల్లెట్ రైలును అహ్మదాబాద్‌కు మాత్రమే ఎందుకు మంజూరు చేశారని.. హైదరాబాద్‌కు ఎందుకు చేయలేదని విమర్శలు గుప్పించారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. కేసీఆర్ పలు మార్లు కేంద్రానికి సమర్పిచిన నివేదికల్లో విజయవాడ – హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైళ్లు ఉండాలని కోరారు. అయితే ముంబైకి బుల్లెట్ రైలే కేంద్రం ఇస్తోంది. ఇది బాగానే ఉంది కానీ పేపర్ మీద నుంచి ఎప్పుడు పనులు ప్రారంభం వరకూ వస్తాయో.. ఆ తర్వాత ఎప్పటికి పూర్తవుతుందో అంచనా వేయడం కష్టం. అది ఈ తరంలోనేనా… వచ్చే తరానికి రెడీ అవుతుందా అన్నది కూడా కష్టమే.