ప్రశ్నిస్తే చాలు తిట్లతో విరుచుకుపడటం .. ఎదురుదాడి చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండున్నరేళ్లుగా ఉన్న విధానం. ఒకరు కాదు ఇద్దరు కాదు .. ఓ మూకలాగా ఒకరి తర్వాత ఎగబడి వ్యక్తిగతంగా బూతులు తిట్టడం… కుటుంబంపైనా నిందలు వేయడం సహజంగా జరిగిపోతోంది.తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విరుచుకుపడ్డారు. దానికి ప్రభుత్వం పరంగా వచ్చిన సమాధానం బూతులే. సంబంధం ఉన్న పేర్ని నాని దగ్గర్నుంచి ఏ సంబంధం లేని.. పోసాని వరకూ అందరూ బయటకు వచ్చారు. పవన్ కల్యాణ్ ను బండ బూతులు తిడితే ఆయన మానసిక స్థైర్యం దెబ్బతింటుందన్న కోణంలోనే చేశారు కానీ .. పవన్ చేసిన ఆరోపణలకు ఒక్కరూ సమాధానం చెప్పలేదు. కానీ పవన్ను ఎన్నిరకాలుగా తిట్టాలో అన్నిరకాలుగా తిట్టారు. కులాన్ని కూడా ఈ అంశంలోకి తీసుకొచ్చారు.
ఒక్క పవన్ కల్యాణ్ విషయలోనే కాదు. టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించినా అదే పరిస్థితి. చచ్చిపోవాలని శాపనార్ధాలు పెట్టేంత పైశాచికత్వం వైసీపీ నేతల్లో పేరుకుపోయింది. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడమే ఎదురుదాడి రాజకీయం అనుకుంటున్నారు. అలా తిడితే ఎదుటి వారు మరోసారి మాట్లాడటానికి భయపడతారని అనుకుంటారో.. మరోకటో తెలియదు సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతల వ్యవహారశైలి ఉంది. మాటలు ఉన్నాయి. వారు .. వీరు అనే తేడా లేదు. అందరూ అలాగే ఉన్నారు.
సాధారణంగా అధికార పార్టీలో ఉన్న వారు సంయమనంతో ఉంటారు. ఎందుకంటే వారిపై బాధ్యత ఉంటుంది. ప్రజలు వారి తీరును జడ్జ్ చేస్తారు. ఎన్నికల్లో ఓటింగ్ వారి పాలనా తీరుపైనే జరుగుతుంది. అందుకే ఎక్కువ అధికార పార్టీలు ఎక్కడా కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఏపీ అధికార పార్టీ మాత్రం ప్రత్యేకం. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవర్ని ఏమైనా అనొచ్చు.. తమను మాత్రం ఎవరూ ఏమనుకూడదు అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ప్రతిపక్షాలు ఉన్నది ప్రశ్నించడానికే. వారు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలి. అంతే కానీ ప్రశ్నించడానికి నువ్వెవరు.. ఎప్పుడు ప్రశ్నించాలి.. ఎలా ప్రశ్నించాలో కూడా సలహాలిస్తూ బూతులు తిట్టడం రాజకీయం కాదు.
దురదషృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్లో అదే రాజకీయం నడుస్తోంది. వైసీపీకి తిట్లు తిట్టడమే రాజకీయంగా మారిపోయింది. వారి తిట్లకు వావి వరసల్లేవు. గౌరవ మర్యాదల్లేవు. హోదాల్లేవు. ఎవరైనా సరే ఎంత మటైనా సరే అనడమే. అదే రాజకీయం అయిపోయింది. ఈ దిగజారిపోయిన పరిస్థితి ఇక కోలుకునే అవకాశం ఉండదు. రేపు మరొకరికి చాన్స్ వస్తే మీరు మాటలతోనే అన్నారు..మేము చేతలతో చూపిస్తామని ప్రత్యర్థి పార్టీ చెలరేగిపోతుంది. లేకపోతే తమను చేతకాని వారంటారని వాళ్ల భయం. అందుకే వైసీపీ నేతలు ప్రారంభించిన ఈ పతనం చాలా వేగంగా సమాజంపై ప్రభావం చూపిస్తుంది.