అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి రోజున పవన్ కల్యాణ్ శ్రమదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం రాజమండ్రి ధవళేశ్వరం వంతెన మీద.. సాయంత్రం అనంతపురం జిల్లాలో చేయనున్నారు. రెండు చోట్ల రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. పాలకులు పట్టించుకోలేదు. అధికారులు వినిపించుకోలేదు. జనసేన నేతలు డిజిటల్ ఉద్యమంలో భాగంగా వాటినీ కవర్ చేశారు. ఇప్పుడు జనసేనాని తన కార్యాచరణలో భాగంగా నేరుగా రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలకు అడుగు పెట్టడానికే పర్మిషన్ ఇవ్వడం లేదు ఇక శ్రమదానానికి ఇస్తారా అన్నదే సందేహం.
ఏపీలో ప్రతిపక్ష నాయకుడు రాజకీయ పర్యటనలకు వెళ్లిన ప్రతి సారి అరెస్ట్ చేయడం రివాజుగా మారింది. చివరికి లోకేష్ కూడా నర్సరావుపేట పర్యటనకు వెళ్తూంటే వందల మంది పోలీసుల్ని మోహరించి అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది పవన్ కల్యాణ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ.. రోడ్డను సొంతంగా బాగు చేయడానికి శ్రమదానానికి సిద్ధమైతే ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని భావిస్తున్నారు. కావాలంటే ఆయనను రోడ్ల మీదకు రాకుండా ముందస్తుగా అరెస్ట్ చేస్తారని కూడా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ, జనసేన మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ సమస్యల విషయంలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం .. వాటిపై వైసీపీ నేతలు బూతులు లంకించుకోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. పవన్ కల్యాణ్ గాంధీ జయంతి రోజున గాంధీగిరీ పద్దతిలో నిరనస తెలియచేస్తున్నారు. దానికి కూడా ప్రతిపక్ష పార్టీ నేతగా ఆయనకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేయడం వంటివి చేస్తే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అవలంభిస్తుందోనన్న ఆసక్తి జనసేన వర్గాల్లోనూ ఉంది.