గులాబ్ తుపాన్ సృష్టించిన బీభత్సం ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తుపాన్ బీభత్సం ప్రారంభం రోజున దానకర్ణుడిలాగా సీఎం జగన్ ఓ ప్రకటన చేశారు. చనిపోయిన వారికుటుంబాలకు రూ. ఐదు లక్షలు.. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ. వెయ్యి ఇవ్వాలని ఆదేశించారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ తుపాను వచ్చినప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రకటనలు చేయడం మాత్రమే కాదు కదా. ఐదు జిల్లాల్లో ఆపార నష్టం జరిగింది. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు.
మూడు జిల్లాల్లో పేదలు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి సమయంలో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తేనే కానీ వారి జన జీవితాలు సాధారణ స్థితికి రావు. ఇలా చేయాలంటే ముఖ్యమంత్రి జగన్ అక్కడ పర్యటించాల్సి ఉంటుంది. సీఎంనే పట్టించుకోకపోతే ఇక జిల్లా స్థాయి నేతలు.. అధికారులు ఏం పట్టించుకుటారు. వారు కూడా ప్రకటనలు చేసి సైలెంటవుతారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యుత్ ఆగిపోయిన గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికే చాలా సమయం పడుతుంది. ఇక పాడైపోయిన రోడ్లు.. నీట మునిగిన పొలాలాసంగతి చెప్పాల్సిన పనిలేదు.
కనీసం తుపాను బాధిత ప్రాంతాల్లో సీఎం పర్యటించాలనే ఆలోచన కూడా చేయడం లేదు. ఆయన క్యాంప్ ఆఫీస్‌లో రాజమండ్రి వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, మార్గాని భరత్ ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నిన్న చాలా సమయం వెచ్చించారు. మరో వైపు ప్రధాన మీడియా కూడా పవన్ కల్యాణ్‌ను పోసాని కృష్ణమురళి ఏమని తిడుతున్నారో చూపించడానికి విశ్లేషించడానికి సమయం కేటాయించింది కానీ వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తమకు ఉన్నట్లుగా ప్రవర్తించలేదు.