వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తిట్ల పరంపర తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కాపు సామాజికవర్గం మొత్తాన్ని తన దగ్గరకు చేర్చుకునే క్రమంలో ఆయన కులాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. మంగళగరిలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనకాపు సామాజికవర్గాన్ని తాను దూరం చేసుకోలేదని ప్రకటించారు. వంగవీటి రంగా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కమ్మ సామాజికవర్గాన్ని వర్గ శత్రువులుగా చూస్తారని కానీ జనసేనకు మాత్రం పేదరికం, అవినీతి వర్గ శత్రువులు అన్నారు. అయినా గుడ్డి ద్వేషం సరి కాదన్నారు. రాష్ట్రం అంటే రెండు కులాలు కాదని స్పష్టం చేశారు.
అదే సమయంలో పవ్ కల్యాణ్ తన విధానంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన ఐడియాలజీ కన్ఫ్యూజింగ్గా ఉందంటున్నారని కానీ ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదన్నారు. ఒక దేశానికి ఒక నది సరిపోతుందా అని ప్రశ్నించారు. మా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని 151 సీట్లు ఉన్న వైసీపీ 15సీట్లకు వస్తుందన్నారు. అప్పుడు పాండవుల సభ ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
సమావేశంలో వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తాను ప్రజాస్వామ్యయుతంగా పోరాడతానని.. కాదంటే ఎలాంటి యుద్దానికైనా సిద్ధమన్నారు. అనాల్సిన మాటలన్నీ అన్న తర్వాత కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా రూ. లక్ష కోట్లకుపైగా ఆదాయం వస్తుందని.. కానీ ఆ డబ్బంతా ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలిపించకపోవడంపైనా ఆయన ప్రజలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం వైజాగ్లో గెలిపించినా స్టీల్ ప్లాంట్ కోసం నిలబడేవాడినన్నారు. తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసం బలంగా నిలబడినా ఓట్లన్నీ వైసీపీకి వేశారని అన్నారు. ఓట్లన్నీ వైసీపీకి వేసి తనను పని చేయమంటే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మీరు కూడా ఆలోచించాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనదే గెలుపన్నారు.