ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న పలు అక్రమాస్తుల కేసుల్లో ఈడీ కేసుల విచారణ చురుగ్గా సాగడానికి మార్గం సుగమం అయింది. మొదటిగా ఆయన మీడియా సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు పూర్తయినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోర్టుక తెలిపింది.ఈడీ కేసుల విచారణ జరగకుండా నిందితులు రకరకాల పిటిషన్లు వేస్తూండటంతో జగతి పబ్లికేషన్స్, పెన్నా, ఇండియా సిమెంట్స్ ఈడీ కేసులపై దర్యాప్తు స్టేటస్ చెప్పాలని ఈడీని కోర్టు ఆదేశించింది. వీటిలో జగతి పబ్లికేషన్స్ పెట్టుబడుల వ్యవహారంపై దర్యాప్తు పూర్తయిందని ఈడీ తెలిపింది.
జగతి పబ్లికేషన్స్ సాక్షి పత్రిక ఓనల్. అలాగే ఆ గ్రూపులోని ఇతర మీడియా సంస్థలకు కూడా పెట్టుబడిదారు. దర్యాప్తు పూర్తయినట్లుగా ఈడీ తేల్చడంతో అభియోగాల నమోదు, డిశ్ఛార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించాలని జగన్, విజయ సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. వాదనలు వినిపించేందుకు ఇదే ఆఖరి అవకాశం అని కోర్టు స్పష్టం చేసింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు అక్రమ మార్గాల ద్వారా మనీ లాండరింగ్ ద్వారా చట్టాలను ఉల్లంఘించి తీసుకు వచ్చారని ఈడీ ఆరోపిస్తోంది.
సీబీఐ కేసులు అవినీతి చేశారని నమోదు చేశారు. ఈడీ కేసులు అక్రమ నగదు చెలామణి కోణంలో నమోదు చేశారు. ఈ క్రమంలో పెట్టుబడుల నగదు ఎలా వచ్చిందో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈడీ కేసుల విచారణ ముందు వద్దని అదే పనిగా కోర్టులకు విజయసాయిరెడ్డి వంటి వారు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎలాంటి పిటిషన్లు వేసి విచారణ జరిపినా తొలిగా జగతి పబ్లికేషన్స్ కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలా ప్రారంభమైతే ఆ కేసులోనే మొదట తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈడీ కేసులు త్వరగా తేలిపోతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.