హైదరాబాద్లో ఉన్న తెలుగు అకాడమీ ఖాతాలో ఉన్న రూ.43 కోట్ల నిధుల గోల్ మాల్ జరిగింది. ఇటీవల అకాడమీ వ్యవహారాలను రెండు రాష్ట్రాల ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో నిధుల గురించి లెక్కలు చూశారు. అప్పుడే రూ. 43 కోట్ల గోల్ మాల్ జరిగినట్లుగా నిర్ణయించారు. మామూలుగా అయితే ఈ మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఆంధ్రా బ్యాంకులో ఉండాలి. ఇటీవల ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనం అయింది. దీంతో యూనియన్ బ్యాంక్ ఖాతాలో ఉండాలి. కానీ ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో తెలుగు అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలున్నాయి. విభజన చట్టం ప్రకారం పదో షెడ్యూల్ సంస్థలో తెలుగు అకాడమీ ఉంది. చాలా రోజుల పాటు ఈ సంస్థల విభజన తేలలేదు. ఇటీవల జనాభా ప్రాతిపదికన నిధఉలు విభజించాలని నిర్ణయించారు. లెక్కల ప్రకారం అకాడమీ నిధులలో రూ.124 కోట్లను ఏపీ తెలుగు అకాడమీకి బదలాయించాల్సి ఉంది. అక్టోబర్ ఒకటో తేదీన బదలాయించాల్సి ఉండటంతో దానికి తగ్గట్లుగా బ్యాంకులకు సమాచారం ఇచ్చారు. కానీ యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అకాడమీకి సంబంధించిన ఎఫ్డీలు గతంలోనే పలు విడతలుగా ఉపసంహరించారని తేలింది.
ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు అకాడమీ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇందులో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటు చేసిన తెలుగు, సంస్కృత అకాడమీకి ఎలాంటి ప్రమేయం లేదని తెలుస్తోంది. గోల్ మాల్ అంతా బ్యాంక్ అధికారులు.. తెలంగాణ తెలుగు అకాడమీ అధికారులే చేసి ఉంటారని.. తమ అకాడెమీ నిధులు తమకు జమ చేయాల్సిందేనని ఏపీ తెలుగు – సంస్కృత అకాడమీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల గుట్టు తెలిస్తే కానీ అసలు విషయం బయటకు రాలేదు.