ప్రశాంత్ కిషోర్ సోదరుడు అని తన కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని షర్మిల అందరికీ చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఏ రాజకీయ పార్టీకీ పని చేయడం లేదు కానీ ఆయనకు చెందిన ఐ ప్యాక్ టీం మాత్రం డబ్బులిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు పని చేస్తోంది. ఈ క్రమంలో షర్మిల కూడా ఐ ప్యాక్ టీంను హైర్ చేసుకుంది. వారు లోటస్ పాండ్‌కు వచ్చి షర్మిల బృందంతో సమావేశాలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రియ అనే మాజీ ఐ ప్యాక్ టీం సభ్యురాలి నేతృత్వంలో ఓ టీం పని చేస్తోంది.
ఆమెకు కాస్త పక్కకు నెట్టి ఐ ప్యాక్ కు షర్మిల బాధ్యతలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఐ ప్యాక్ టీం షర్మిల పాదయాత్ర వ్యూహాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ప్రజాప్రస్థానం పాదయాత్రను వచ్చే నెల నుంచి ఏడాది పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర సాదాసీదాగా సాకుండా విభిన్నంగా… ఉండేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఘటనలు.. సంఘటనల సమాహారంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రను పీకే టీం కోఆర్డినేట్ చేసింది. ఎప్పుడు ఏ సమయంలో ఎవరెవరు వచ్చి జగన్ ను కలవాలి .. ఏ సమయంలో ఆయన పక్కన ఎవరెవరు నడవాలి.. మీడియాలో ఎలాంటి ప్రచారం రావాలి ఇలాంటివన్నీ ఆ టీం చూసుకుంది.
ఇప్పుడు షర్మిల పాదయాత్రను కూడా అంత కంటే గొప్ప రేంజ్లో ప్లాన్ చేయాలని నిర్ణయించారు. పాదయాత్ర సమయానికి సాక్షి తెలంగాణ విభాగం మొత్తం షర్మిల చేతికి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పబ్లిసిటీకీ ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల కోసం ఐ ప్యాక్ టీం ఎలాంటి మాయలు చేస్తుందన్న దానిపై చర్చ ప్రారంభమయింది.