సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులను ఓడించడానికి ఫేకింగ్కే రాజకీయ పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. హుజురాబాద్ ఉపఎన్నికల్లో మొదటి నుంచి ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ కేసీఆర్ ను క్షమాపణ కోరినట్లుగా ఓ లేఖ.. ఓ సామాజికవర్గాన్ని ఈటల బావమరది అవమానించిటన్లుగా వాట్సాప్ స్టేటస్లు .. ఆడియో టేపులు ఇలా రకరకాలుగా బయటకు వచ్చాయి. తాజాగా దళిత బంధు ఆపాలంటూ ఈటల లేఖ రాశారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించారు.
దళిత బంధు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఈటల ఫిర్యాదు చేశారంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఓ లేఖను విడుదల చేశారు. సీఎం కేసీఆర్ దళితులను లక్షాధికారులను చేయాలని చూస్తే.. ఈటల ఓర్వలేకపోతున్నారని, అలాంటి ఈటలను వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన దళితులకు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలను ఈటల ఖండించారు. దళితబంధు వద్దు.. అని నేను రాసినట్టు ఓ అబద్ధపు లేఖ పుట్టించి చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ లేఖలు సృష్టించి దానిపై ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక లో ఫేక్ పోస్టులతోనే ఎక్కువగా ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా ఫేక్ పోస్టులు రావడం.. అలా ఈటలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం కామన్ అయిపోయింది. ఈటల రాజీనామా చేసినప్పటి నుడంి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరహా ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాత వీడియోలతో డబ్బులు.. వస్తువులు పంచుతున్నారని కొంత మంది.. నేతల్ని గ్రామస్తులు తరిమికొడుతున్నారని మరికొందరు వీడియోలు పెడుతున్నారు. ఇక ఆడియోలకయితే లెక్కలేదు. ఇలాంటి స్క్రిట్లతో హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పటికే… ఔరా అనుకునేలా మారిపోయింది.