బద్వేలు ఉపఎన్నికకు రేపట్నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తమ కూటమి వైఖరిని ఖరారు చేసేందుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌ను మంగళగిరి జనసేన ఆఫీసులో కలిశారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీకి పోటీ చేసే అవకాశం ఇచ్చినందున బద్వేలులో జనసేన పోటీ చేయాలని సోము వీర్రాజు పవన్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే బద్వేలులో పోటీ అంశంపై జనసేన ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. ఎలాంటి కసరత్తు చేయకపోవడంతో అభ్యర్థిని ఎంపిక చేయడం ఇతర అంశాలు క్లిష్టతరం అయ్యే అవకాశం ఉంది.
సోము వీర్రాజు ఆఫర్‌పై పవన్ కల్యాణ్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కూడా అక్కడ్నుంచి పోటీ చేయలేదు. బీఎస్పీ అభ్యర్థికి చాన్సిచ్చింది. బీజేపీ సొంతంగా పోటీచేసింది. రెండు పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఎవరు పోటీ చేసినా పెద్దగా తేడా ఉండదన్న అభిప్రాయం ఉంది. పవన్ – సోము వీర్రాజు భేటీలో రెండు పార్టీల ఉద్యమ ప్రణాళికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
పవన్ రోడ్ల బాగు కోసం శ్రమదానం చేస్తూండగా.. మత్స్యకారుల కోసం తాము మహాధర్నా చేస్తున్నామని సోమువీర్రాజు చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఇటీవల గ్యాప్ పెరిగిపోయిందన్న ప్రచారం నేపధ్యంలో వీరి భేటీ రెండు పార్టీల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే బద్వేలు ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.