ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సత్తెనపల్లి శాసనసభ్యుడు అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్లుజారీ అయ్యాయి.హెరిటేజ్ సంస్థ వేసిన పరువు నష్టం కేసులో.. కన్నబాబు, అంబటి రాంబాబు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో ఇద్దరిపైనా హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఎనాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నిజానికి ఇది మొదటి సారి కాదు. మూడో సారి . అయినా వారు కోర్టుకు హాజరు కావడం లేదు. వారెంట్లను పోలీసులు అమలు చేయడం లేదు.
గతంలో హెరిటేజ్ కంపెనీపై ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. మజ్జిగ ప్యాకెట్లు అని రకరకాల ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబు, కన్నబాబు ఎక్కువగా ఈ ఆరోపణలు చేశారు. వీటిపై హెరిటేజ్ సంస్థ కోర్టులో పరువు నష్టం కేసులు నమోదు చేసింది. మొదట్లో ఎన్ని సార్లు విచారణ జరిగినా హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగే విచారణకు తప్పని సరిగా హాజరై వ్యక్తిగత పూచీకత్తు, రూ.5 వేలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను పాటించలేదు. మార్చిలో జరిగిన విచారణకూ హాజరు కాలేదు. అలా వరుసగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ హాజరు కావడం లేదు.
గురువారం జరిగిన విచారణకూ ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొసమెరుపేమిటంటే.. హెరిటేజ్ ప్రతినిధులూ విచారణకు హాజరు కావడంలేదు. హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి కూడా హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబరు 7కి వాయిదా వేసింది.