హుజురాబాద్‌లో కనీసం ఓటు బ్యాంకును అయినా కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదు. అంతో ఇంతో బలమైన అభ్యర్థి అవుతారని కొండా సురేఖను ఒప్పిస్తే …ఆమె రకరకాల షరతులు పెడుతున్నారు. భూపాలపల్లిలో జరిగిన సభలో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు కానీ ఆ ప్రకటన చేయలేదు. పోటీ చేసే విషయంలో కొండా సుేఖ ఏ విషయాన్ని చెప్పకపోవడమే కారణం అని టీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. హుజురాబాద్‌లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం పరకాలతో పాటు వరంగల్ తూర్పు టిక్కెట్‌ను కూడా తన కుటుంబానికే కేటాయించాలని ఆమె షరతు పెడుతున్నారు.
అయితే టిక్కెట్ల విషయంపై హామీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సహా ఇతర నేతలెవరూ సిద్ధంగా లేరు. తమకు క్లారిటీ కావాలని అప్పుడే పోటీ చేస్తామని కొండా దంపతులు పట్టుబడుతున్నారు. దీంతో అభ్యర్థుల పేర్లలో కొత్త కొత్తగా కొంత మంది వచ్చి చేరుతున్నారు. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన నలుగురు పేర్లలో కొండా సురేఖ పేరు లేదు. కృష్ణారెడ్డి, రవికుమార్, ప్యాట రమేష్, సైదులు అనే నేతల పేర్లు ఉన్నాయి. అయితే బలహీన అభ్యర్థిని నిలబెడితే పరువు పోతుందన్న ఉద్దేశంతో టీ పీసీసీ నేతలు ఆలోచిస్తున్నారు.
ఉపఎన్నిక జరుగుతుందని తెలిసి కూడా అభ్యర్థిని ఖరారు చేసుకోలేక కాంగ్రెస్ తంటాలు పడుతోంది. గతం కన్నా పెద్దగా పరిస్థితి మారలేదని కార్యకర్తలు గొణుక్కుంటున్నారు. అదే సమయంలో ఈ ఉపఎన్నికకు ఇంచార్జిగా ఉన్న దామోదర రాజనర్సింహ కూడా గట్టిగా ఏ విషయాన్ని చెప్పకపోవడంతో మరింత గందరగోళం ఏర్పడుతోంది.