తెలుగు360 రేటింగ్: 2.5/5
కాస్త చదువుకుని, లోక జ్ఞానం ఉన్న వాళ్లకెవరికైనా వ్యవస్థపై ఓ రకమైన కోపం ఉంటుంది. రాజ్యాంగపరంగా అన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? లేదా? జరక్కపోతే కారణమెవరు? అన్యాయానికి బలైంది ఎవరు? అనే విషయాల్లో ఆరా ఉంటుంది. ఆ కోపం, ఆలోచన, కసి… ఇవన్నీ ఓ రచయితకు ఉంటే ఓ కథ రాస్తాడు. జర్నలిస్టుకి ఉంటే ఓ ఆర్టికల్ రాస్తాడు. అదే దర్శకుడికి ఉంటే, ఓ సినిమా తీస్తాడు. అలాంటి సినిమా `రిపబ్లిక్`. రాజ్యంగ పరంగా మన హక్కులేమిటి? విధులేమిటి? ప్రభుత్వ విధానాలేమిటి? ఉద్యోగ వ్యవస్థ ఎలా పనిచేయాలి? ఇలాంటి విషయాల్లో చాలామందికి అవగాహన ఉంది. కానీ లేనిదల్లా బాధ్యత మాత్రమే. అలాంటి బాధ్యతారాహిత్యం కార్యనిర్వాహక వర్గానికి (అంటే ఉద్యోగులకు) ఉంటే వ్యవస్థ పూర్తిగా కుళ్లిపోతుంది. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పే కథ రిపబ్లిక్. దేవాకట్టా ఆలోచనలేంటో… ఈపాటికి అందరికీ అర్థమయ్యే ఉంటాయి. తను ఇలాంటి ఓ సీరియస్పొలిటికల్ డ్రామా ఎంచుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మరి.. ఈసారి తన కథకు న్యాయం చేశాడా? లేదా? రిపబ్లిక్ లో జిల్లా కలెక్టర్ గా సాయిధరమ్ తేజ్ ఎంత వరకూ మెప్పించాడు?
అభిరామ్ (సాయిధరమ్ తేజ్) తెలివైన విద్యార్థి. పుస్తకాల్లోనే కాదు, జీవితంలో ఎదురైన ప్రతి ప్రశ్నకూ సమాధానాలు వెదుకుతూ ఉంటాడు. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి, అమెరికాలో సెటిల్ అవ్వాలన్నది తన ఆశ. కాకపోతే.. కలెక్టర్ (సుబ్బరాజు)తో ఈగో క్లాష్ వల్ల, తాను కూడా ఐఏఎస్ అవ్వాలన్న ఆలోచన వస్తుంది. బాగా చదివి, జిల్లా కలెక్టర్ అవుతాడు. కానీ… కలెక్టర్ అయ్యే ప్రోసెస్‌లో వ్యవస్థలో మార్పు అంత సులభం కాదని, ఉద్యోగులంతా ప్రభుత్వానికి బానిసలే అనే నిజం తెలుసుకుంటాడు. ఇంటర్వ్యూలోనూ అదే చెబుతాడు. దాంతో యూపీఎస్సీ.. అభిరామ్ ని కలెక్టర్ గా నియమిస్తూ కొన్ని ప్రత్యేకమైన అధికారాల్ని ఇస్తుంది. ఆ అధికారాలతో వ్యవస్థని మార్చాలనుకుంటాడు. తన పరిధిలో ఉన్న తెన్నేరు మంచి నీటి సరస్సు చుట్టూ ఉన్న కుళ్లుని కడిగేయాలని భావిస్తాడు. ఆ క్రమంలో తనకెదురైన అవరోధాలేంటి? దాన్నుంచి ఎలా బయటకు వచ్చాడు? అంతిమంగా ఈ వ్యవస్థని మార్చాడా, లేదా? అనేది మిగిలిన కథ.
ప్రారంభ వాక్యాల్లో చెప్పినట్టే దేవాకట్టాకు ఈ వ్యవస్థపై ఓ రకమైన అవగాహన ఉంది. తప్పెక్కడ జరుగుతోందో, కారణమెంటో ఆయనకు తెలుసు. అదే తెరపై చూపించాన్న ప్రయత్నం చేశారు. వ్యవస్థని మార్చాలని చూసిన ఓ జిల్లా కలెక్టర్… చివరికి ఆ వ్యవస్థ చేతికే ఎరగా ఎలా చిక్కాడన్నది కథ. నిజానికి.. ఈతరహా కథల్ని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాలి. ఆ ధైర్యం, సిన్సియారిటీ కథలో కనిపించాయి కూడా. కానీ.. ఇవి రెండూ సరిపోవు. అన్నింటికంటే ముఖ్యంగా క్లారిటీ ఆఫ్ థాట్ చాలా అవసరం.
మూడు రకాలైన చేపల గురించి చెబుతూ కథ మొదలెట్టాడు దేవాకట్టా. నీచు తినే వెజిటేరియన్ చేపలు, పురుగుల్ని తినే నాజ్ వెజ్ చేపలు, తమ సొంత జాతినే తినే రాక్షస చేపలు. చివరికి చిన చేపని పెద చేప మింగు సూత్రాన… ఈ చేపలన్నీ అంతమైపోతాయంటూ ఓ పిట్ట కథ చెప్పాడు. ఆ పిట్ట కథలోనే ఈ సినిమాకి సంబంధించిన ఆలోచన మొత్తం దాగుంది. కానీ ఈ చేప కథకీ, అసలు కథకీ సంబంధం ఏమిటన్నది అంత తేలికగా అర్థమయ్యే విషయం కాదు. `స్వేచ్ఛ` గురించి హీరో, తన మిత్రులతో కలిసి పాడుకునే పాట కూడా అంతే. అసలు ఆ పాటేంటి? దాని వెనుక వ్యవహారం ఏమిటి? అనేది పెద్ద ఫజిల్. ఆ స్వేచ్ఛ పేరు స్వాతంత్య్రమని తెలిసినవాళ్లకు తప్ప – మిగిలిన వాళ్లకు ఆ పాట.. జస్ట్ టైమ్ పాస్ గంతుల్లానే అనిపిస్తుంది. దర్శకుడి భావాలు గొప్పవైనంత మాత్రన సరిపోదు. అది ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలన్న విషయాన్ని దేవాకట్టా ముందు సీన్లలోనే పక్కన పెట్టేయడం `రిపబ్లిక్` లాంటి కథలకు ప్రధానమైన శాపం.
దేవాకట్టాలో మంచి రచయిత ఉన్నాడు. కాకపోతే ఆ రచయిత ప్రతీసారీ దర్శకుడ్ని డామినేట్ చేయడానికే ప్రయత్నించాడు. దాంతో పేజీల కొద్దీ డైలాగులు పుట్టుకొచ్చాయి. కేవలం డైలాగులతోనే సన్నివేశాల్ని నడిపించేయాలన్న తాపత్రయం మరో ప్రధాన ఆటంకం. సినిమా అనేది విజువల్ మీడియం. సన్నివేశాన్ని ఎంత విజువలైజ్ చేస్తే ఎంత గొప్పగా ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోతుంది. అది వదిలేశాడు దేవాకట్టా. ఉదాహరణకు… తెన్నేరు కథని ఆటో ట్రైవర్ (రాహుల్ రామకృష్ణన్) మాటల్లో చెప్పుకుంటూ పోయాడు. నిజానికి ఆ కథ వెనుక చాలా పెద్ద దుర్మార్గమే ఉంది. కేవలం మాటల రూపంలో దాన్ని చెప్పుకుంటూ పోతే.. ప్రేక్షకులపై ఇంపాక్ట్ ఏమాత్రం ఉంటుంది?
ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు అనవసరమైన ఫ్లాష్ బ్యాక్‌లతో కథని మరింత నత్త నడక నడిపించాడు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్..ఇలా ప్రతీ పాత్రకూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. జగపతిబాబు ఓ అవినీతి ఉద్యోగి. అలాంటివాళ్లు ప్రతీ చోటా ఉంటారు. ఆ పాత్ర అలా ఎందుకు మారింది? అని కన్వెన్సింగ్ గా చెప్పడానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? రమ్యకృష్ణ ఓ క్రూరమైన పొలిటికల్ లీడర్. ఆమె అలా ఎందుకు తయారైంది? అనేది ఫ్లాష్ బ్యాక్ తో చెప్పాలా? ఇలా.. కథని వీలైనంత వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు దేవాకట్టా. ఇంటర్వ్యూ సీన్ బాగుంది. కాకపోతే.. ఆ ప్రశ్నలు, సమాధానాలు, అందులో ఉన్న పొలిటికల్ నాలెడ్జ్ సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుందా? రమ్యకృష్ణ – సాయిధరమ్ తేజ్ మధ్య నడిచిన డార్విన్ సిద్ధాంతం కూడా అంతే. మనిషుల్లో ఇంకా కోతులు మిగిలే ఉన్నారు. వాళ్ల సంఖ్యే ఎక్కువ. వాళ్లని ఆడించడమే… రాజకీయం అని చెప్పడం బాగుంది. కానీ… అందుకోసం డార్విన్ సిద్ధాంతం మొత్తం వివరించి, 5 నిమిషాల సీన్ చేయడం ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ కోర్టు సీన్ కూడా అంతే. జడ్జ్ ఎంతకు అంత రియాక్ట్ అయి, సంచనల తీర్పు ఇచ్చాడో… మన బుర్రకు అంతగా ఎక్కదు.
సినిమా అంతటితో అయిపోదు. క్లైమాక్స్ ఇంకో 5 నిమిషాలు లాగి – అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? అనేది అర్థం కాకుండా చేశాడు. అంటే… ఈ వ్యవస్థని ఎంత మార్చాలనుకున్నా మారదు అనే కదా? హీరో లక్ష్యం నెరవేరలేదు అనే కదా?
సాయిధరమ్ తేజ్ తన సిన్సియర్ ఎఫెక్ట్ పెట్టాడు. డైలాగులు బాగా చెప్పాడు. కానీ… బాగా ఒళ్లు చేశాడు. తనకిష్టమైన డాన్సుల్ని చేయడానికీ ఇబ్బంది పడుతున్నాడంటే అర్థం చేసుకోవొచ్చు. అర్జెంటుగా తన ఫిజిక్ పై దృష్టి పెట్టాలి. ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ అనలేం. ఓ పాత్ర అంతే. రమ్యకృష్ణ హుందాతనం నిండిన విలనిజం చూపించింది. కానీ ఆశించినంత పవర్ఫుల్ గా అయితే లేదు. జగపతిబాబు పాత్ర ని చివరి సన్నివేశాల్లో వాడుకున్నారంతే. ఆమని లాంటి నటికి రెండు డైలాగులు ఇచ్చి `సరిపెట్టుకో`మన్నారు.
పాటలు మైనస్. అంత కిక్ లేదు. నేపథ్య సంగీతంలోనూ మణి మార్క్ కనిపించలేదు. దర్శకుడి తాపత్రయం ఓకే. కానీ దాన్ని జనాలకు అర్థమయ్యేలా కన్వే చేయడంలో ఇబ్బంది పడ్డాడు. చెప్పిన డైలాగే, చెప్పిన ఎమోషనే మళ్లీ మళ్లీ చెప్పి బోర్ కొట్టాడు. ఈ కథని సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చెప్పాలా, లేదంటే వాస్తవికతకు దగ్గరగా చెప్పాలా? అనే విషయంలోనూ తాను కన్ఫ్యూజ్ అయ్యాడు. అందుకే అక్కడక్కడ లిబర్టీ తీసుకుంటూ, అక్కడక్కడ రియాలిటీకి దగ్గరగా వెళ్తు.. ఎటూ కానీ జంక్షన్లో నిలబడిపోయాడు. `ప్రభుత్వం మారడం అంటే పాత గుండాలు గూటిలోకి వెళ్లి, కొత్త గుండాలు రావడం` లాంటి డైలాగులు రాయడానికి దమ్ము, ధైర్యం కావాలి. అలాంటి కొన్ని డైలాగులు సూటిగానే తాకాయి. అయితే ఆ డైలాగులే కొన్ని చోట్ల ఎక్కువై.. సన్నివేశం మొత్తాన్ని ఆక్రమించేసుకుని, ఫీల్ లేకుండా చేశాయి.
దర్శకుడి నిజాయితీ అడుగడుగునా కనిపించినా, తాను రాసుకున్న కథ ను జనరంజకం గా చెప్పడం లో తడబడ్డాడు. దాంతో రీ పబ్లిక్ అంచనాలను అందుకోలేక పోయింది.
తెలుగు360 రేటింగ్: 2.5/5