రోడ్ల దుస్థితిని ప్రజల ముందు ఉంచి ప్రభుత్వ వైఫల్యాన్ని బయట పెట్టి .. శ్రమదానం చేసి ఆ రోడ్లను బాగు చేయాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ ఉద్యమాన్ని గాంధీ జయంతి రోజు నుంచి ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ రెండు చోట్ల శ్రమదానం చేయాలని నిర్ణయించారు. ఆ రెండు చోట్ల హుటాహుటిన రోడ్లకు మరమ్మతులు చేశారు. ధవళేశ్వరం బ్రిడ్జిపైకి అనుమతి లేదని అధికారులతో ప్రకటనలు చేయించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శ్రమదానంతో మరమ్మతులు చేసి తీరుతామని ప్రకటించారు. దీంతో రాత్రికి రాత్రి వంతెనపై గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా కొత్త చెరువులోనూ అదే పరిస్థితి. అయితే ఈ మరమ్మతులు కూడా తూ..తూ మంత్రంగా చేశారు.
ప్రభుత్వం నుంచి వ్యతిరేక ప్రకటనలు వస్తూండటంతో పవన్ కల్యాణ్ శ్రమదానం చేయకుండా అడ్డుకుంటారని జనసేన వర్గాలు నమ్ముతున్నాయి. ఈ క్రమంలో అనుకున్న ప్రకారం పవన్ కల్యాణ్ శ్రమదానం చేసి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నా వదలకూడదని పట్టుదలతో ఉన్నారు. ఒక వేళ ధవళేశ్వరం బ్రిడ్జిపైకి వెళ్లేందుకు లేకుండా కట్టడి చేస్తే ..మరో రోడ్డులో శ్రమదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముందుగా తెలిస్తే ప్రభుత్వం కూడా అడ్డుకునే ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి చివరి క్షణం వరకూ ఆ అంశాన్ని రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు రోడ్ల దుస్థితిపై జనసేన రాద్దాంతం చేస్తోందని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు. వర్షాలు ముగిసిపోయిన వెంటనే మరమ్మత్తులు చేస్తామని.. ఇప్పటికే వేల కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేశామని చెబుతున్నారు. అయితే రెండున్నరేళ్లుగా ధ్వంసమైన రహదారుల్ని.. వరుసగామూడు వర్షాకాలాలు వచ్చినా బాగు చేయని ప్రభుత్వం ఇప్పుడు పవన్ కల్యాణ్ ఉద్యమం ప్రారంభించే సరికి ఇలాంటి ప్రకటనలు చేస్తోందని.. జనసేన వర్గాలు అంటున్నాయి. తాము నెల రోజుల డెడ్ లైన్ పెట్టామని ఆ సమయంలోనూ బాగు చేయలేదని విమర్శిస్తున్నారు. గాంధీ జయంతి రోజున శ్రమదానంతో మరింత రాజకీయ రచ్చ కావడం ఖాయంగా కనిపిస్తోంది. .