సినిమా పరిశ్రమ కోసం గొంతెత్తినప్పటికీ పవన్ కల్యాణ్‌కు బడా నిర్మాతలు అండగా నిలబడలేదన్న విమర్శలు జోరుగా వినిపించాయి. వీటికి చెక్ పెట్టడానికా అన్నట్లుగా పవన్ కల్యాణ్‌ను నిర్మాతలు కలిశారు. మచిలీపట్నంలో మంత్రి పేర్నినానితో సమావేశమైన నిర్మాతలందరూ ప్రత్యేకంగాపవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నానితో జరిగిన చర్చల వివరాలను వారు పవన్ కల్యాణ్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీకి ఏమీ సమస్యలు లేవని కాదని.. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని పరిష్కరించాలని సినిమా పరిశ్రమ ప్రతినిధులు పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని చెబుతోంది కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఈ కారణంగా సినిమాల విడుదల ఎక్కడివక్కడ ఆగిపోతోంది. ప్రభుత్వంతో లడాయి పెట్టుకోవడం కన్నా సామరస్యంగా అనుమతులు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించమంటే నిర్మాతలు ఖండించారు. సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగవద్దని కూడా కోరారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అందాల్సిన సహకారం అందలేదు.
పవన్ కల్యాణ్ భేటీలో ప్రభుత్వంతో తదుపరి అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించినట్లుగా భావిస్తున్నారు. అల్లు అరవింద్ కూడా ప్రభుత్వాన్ని వేడుకున్నట్లుగా ప్రకటన చేశారు. ఇక వేడుకునేది లేదని.. తాడో పేడో తేల్చుకుందామన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు తమ రూట్‌ను మార్చే అవకాశాలున్నాయని అంటున్నారు. నిర్మాతల తీరుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.