ప్రతి ఏడాది 20 శాతం మద్యం దుకాణాల్ని తగ్గించుకుంటూ పోయి ఎన్నికల ఏడాదిలో స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మేలా నిషేధం విధిస్తామని సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఆయన తొలి ఏడాది 20 శాతం దుకాణాల్ని తగ్గించారు. లాక్ డౌన్ తర్వాత మరో 13 శాతం దుకాణాల్ని తగ్గించారు. ఇప్పటికి రెండున్నరేళ్లు గడిచిపోయాయి. అయితే ఈ సారి మాత్రం దుకాణాల్ని తగ్గించాలనే ఆలోచన చేయడం లేదు. కానీ పేరు మార్చి ఇతర దుకాణాలను.. పెంచాలని నిర్ణయించారు. పర్యాటక ప్రాంతాల్లో మద్యం మాల్స్ పేరుతో తగ్గించిన వాటినీ పెంచాలని నిర్ణయించారు.
కొత్త మద్యం విధానం అంటూ ఎక్సైజ్ శాఖ ఓ గెజిట్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఏపీలో 2934 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ యధావిధిగా కొనసాగించాలని గెజిట్లో పేర్కొన్నారు. కొత్తగా పర్యాటక ప్రదేశాల్లో షాపులు, పట్టణాల్లో వాక్-ఇన్ స్టోర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే దుకాణాలు తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ముఖ్యంగా ప్రభుత్వం అనుకున్న విధంగా అమ్మకాలు తగ్గిపోతాయన్న అంచనాలు అందుకోలేదు. ప్రతి నెలా ప్రభుత్వానికి మద్యం ద్వారా రూ. 1500 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. నాలుగేళ్ల కిందట ఇది రూ. వెయ్యి కోట్ల వరకు మాత్రమే ఉండేది.
మద్య నిషేధం అనేది సీఎం జగన్ సంకల్పంలో ఒకటి. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత పట్టు విడువక తప్పడం లేదు. అమ్మకాలు తగ్గించడానికంటూ పెద్ద ఎత్తున రేట్లు పెంచడంతో ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. కానీ తాగే వారు తగ్గలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో మేనిఫెస్టోలో చెప్పినట్లుగా మద్య నిషేధం ఉంటుందా ఉండదా అన్నదానిపై సందేహాలు ప్రారంభమయ్యాయి.