హుజురాబాద్ ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మారనుంది. పార్టీలు ఖర్చు పెట్టేది ఎంతో అంచనా వేయడం కష్టం. కానీ ప్రభుత్వమే అధికారికంగా ఉపఎన్నిక లక్ష్యంగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ. మూడువేల కోట్ల వరకూ ఉంటోంది. అభివృద్ధి పనులు, పథకాల కోసం చేతికి ఎముక లేకుండా కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నారు. అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లాంటి పనులన్నీ చకచకా పూర్తి చేశారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని శరవేగంగా ఎంపిక చేసి అమలు చేయడం ప్రారంభించారు. కొత్త పెన్షన్లు ఇస్తున్నారు. రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా పథకాలను అమలు చేస్తున్నారు.
గొర్రెల పథకానికి గతంలో చాలా మంది డీడీలు కట్టారు. ఎవరికీ ఇవ్వలేదు. కానీ హుజురాబాద్లో మాత్రం 2800 యూనిట్లు గొర్రెలను పంపిణీ చేసేశారు. ఇక రూ. రెండు వేల కోట్లు దళిత బంధుకు విడుదల చేశారు. ఇక హుజురాబాద్ పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులకు అభివృద్ధి పనులకు రూ. రూ. 220 కోట్లు విడుదల చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీని ఎప్పుడో నిలిపేసిన ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం రూ. 120 కోట్లు చెల్లించింది. హంగామా మధ్య వాటిని పంపిణీ చేశారు.
ఒక్క దళితులకే రూ. పది లక్షలు ఇస్తే తమకేంటి అనుకునే ఇతర వర్గాలను సంతృప్తి పరిచేందుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. పద్మశాలీ, నాయిబ్రాహ్మణ, రెడ్డి, కాపు, వైశ్య, గౌడ సామాజికవర్గాలతో ఆత్మీయ సమావేశాలు పెట్టారు. వారి కోరికలను తీరుస్తున్నారు. ప్రభుత్వమే అధికారికంగా అభివృద్ధి పనులు. సంక్షేమం కోసం రూ. మూడు వేల కోట్ల వరకూ ఖర్చు చేస్తోంది. ఇక రాజకీయ పార్టీలు చేసే ఖర్చు కూడా చాలా ఎక్కువే ఉంటుందన్న అభిప్రాయం ఉంది.