జగన్‌పై ఎప్పుడూ పూర్తి స్థాయి వ్యతిరేకతతో తన వారాంతపు అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించే ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఈ వారి మాత్రం ” కట్టా- మీఠా ” టైపులో “కొత్తపలుకు”లు వినిపించారు. సినిమా టిక్కెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరును దాదాపుగా సమర్థించారు. అత్యధికంగా రెమ్యూనరేషన్లు తీసుకోవడమే అసలు సమస్యకు కారణం అని.. టాప్ హీరోలు, దర్శకుల్ని నిందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వ్యతిరేకించకపోతే ఇంకా రేట్లు తగ్గిస్తామని ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని హెచ్చరించిందని చెప్పిన ఆర్కే… అది కూడా తప్పు కాదన్నట్లు “కొత్తపలుకు”చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు టిక్కెట్ రేట్లు ఎలా పెంచుకున్నారు.. తర్వాత ఎలా తగ్గిపోయింది..ఇలా చాలా అంశాలు ఈ విషయంలో చెప్పినా.. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారని ఇండస్ట్రీతో ఆడుకుంటున్నారని మాత్రం చెప్పలేదు. ఓ రకంగా జగన్ నిర్ణయంలో తప్పు లేదని స్పష్టం చేశారు. అయితే ఇండస్ట్రీకి ఆన్ లైన్ టిక్కెట్ల విషయంలో ఉన్న కొన్ని అభ్యంతరాలు ఎంత కమిషన్ వసూలు చేస్తారు..? కలెక్షన్ల డబ్బులు ఎప్పుడు ఇస్తారు వంటి వాటి మీద మాత్రమే క్లారిటీ ఇస్తే చాలన్నారు.
అయితే సినీ ఇండస్ట్రీకి ఆన్ లైన్ టిక్కెట్ల కంటే పెద్ద సమస్య టిక్కెట్ రేట్ల తగ్గింపు. కానీ ఎందుకో అందరూ ఆన్ లైన్ టిక్కెట్ల గురించే మాట్లాడుతున్నారని ఆర్కే చెబుతున్నారు. టిక్కెట్ రేట్ల తగ్గింపుతో ఎలాంటి ఎఫెక్ట్ టాప్ హీరోలు ప్రొడ్యూసర్లపై పడుతుందో ఆర్కే విశ్లేషించారు. చిరంజీవి ఆచార్య నిర్మాతల్లో ఒకరు.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల లాయర్ నిరంజన్ రెడ్డి. ఆయన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కాబట్టి ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆర్కే చెబుతున్నారు. ఏం జరిగినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదనేది నిజం. ఈ విషయంలో ఆర్కే ఎక్కడా జగన్ నిర్ణయాలను తప్పు పట‌్టలేదు.
అయితే మంత్రులు వినిపిస్తున్న వల్గర్ లాంగ్వేజ్ విషయంలో వేమూరి రాధాకృష్ణ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి డైరక్షన్‌లోనే అంతా నడుస్తుందని తేల్చేశారు. కమ్మ, కాపులంటే ఆయనకు పడదని వాళ్ల కులాల్ని వాళ్ల వాళ్లతోనే తిట్టించి… చులకన చేసి ఆయన ఆనంద పడుతూంటారని ఆయన తేల్చేశారు. దానికి ఉదాహణంగా పేర్ని నాని, కొడాలి నాని, పోసాని లాంటివాళ్లు సందర్భం లేకపోయినా కులాల ప్రస్తావనల్ని తీసుకు వచ్చి అదే పనిగా తిట్ల దండకం వినిపించడాన్ని చూపించారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్‌కూ ఆర్కే బోలెడు సలహాలిచ్చారు. కాపు కులాన్ని ఆకట్టుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని.. తన బేస్ అదే కాబట్టి ఆ కులం మద్దతును పూర్తి స్థాయిలో పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అది కరెక్ట్ కాదని.. సలహా ఇచ్చారు. జగన్ ఉచ్చులో పడవద్దని ఆయన అంటున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి విసిరిన ట్రాప్‌లో పడ్డారని వీలైనంత త్వరగా బయటకు రావాలని ఆయన సూచిస్తున్నారు. పనిలో పనిగా టీడీపీతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలొస్తాయన్న సలహా కూడా ఇచ్చారు. మరి ఈ సలహా పవన్ కల్యాణ్‌కు ఎలా చేరుతుందో మరి !