నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన దిల్ సుఖ్ నగర్ టు ఎల్బీనగర్ పాదయాత్ర సాఫీగా సాగి ఉంటే ఏం జరిగేదో కానీ పోలీసులు అడ్డుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ చర్చనీయాంశమయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. అచ్చంగా అలాంటి ప రిస్థితులే కనిపించాయి. అనేక మంది యువ నేతలపై లాఠీ విరిగింది. మెట్రో స్టేషన్లు మూసి వేశారు. ముఖ్యనేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగింది శ్రీకాంతాచారి అనే అమరుడికి నివాళులు అర్పించకుండా. పోలీసులు ఎంత నిర్బంధం చేస్తే అంత పట్టుదల పెరిగిన ఉద్యమం తరహాలో అనేక మంది వలయాల్ని చేధించుకుని ఎల్బీ నగర్ వచ్చేశారు. శ్రీకాంతాచారి విగ్రహానికి దండలు వేసి నివాళులు అర్పించారు. పోలీసుల లాఠీలు ఆపలేకపోయాయి.
తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్లో ఎగసిపడటానికి కారణం ఎల్బీ నగర్ సర్కిల్లో శ్రీకాంతాచారి అనే తెలంగాణ యువకుడు ఆత్మాహుతి చేసుకోవడం. ఆ ఘటన మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో తెలంగాణ యువతలో ఉద్రేకం వెల్లువెత్తింది. ఉద్యమం కూడా ఎగసింది. తర్వాత తెలంగాణ కల సాకారం అయింది. అందుకే ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి విగ్రహం కూడా పెట్టారు. ఆ అమరుడి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్లో ఎమ్మెల్యే టిక్కెట్ పొందారు.. కానీ గెలుపొందలేదు. ఇంకా ఏ పదవులు పొందలేదు. ఆ వివాదం అలా సాగుతూండగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ..తెలంగాణ సర్కార్‌పై యువతలో వ్యతిరేకతను పెంచడానికి శ్రీకాంతాచారి ఆశయాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది.
నియామకాలు తెలంగాణ ఉద్యమంలో కీలక అంశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పెద్దగా ఉద్యోగాలు కల్పించలేదన్న అభిప్రాయం ఉంది. అసంతృప్తి ఉంది. ఎప్పటికపపుడు నోటిఫికేషన్లు అంటారు కానీ.. ఇవ్వరు. ఈ క్రమంలో యువతలో ఉన్న అసంతృప్తిని రాజకీయ పోరాటాలు మార్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగు ముందుకేశారు. కానీ ప్రభుత్వం అణిచివేతకు ప్రయత్నించడంతో అది ఎగసిపడింది. ఇప్పుడు శ్రీకాంతాచారి త్యాగం కాంగ్రెస్‌కు బలమయ్యే అవకాశం కనిపిస్తోంది.