ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడా లేనంత అభిమానం చూపిస్తున్నారు. ఆయనను విజ్ఞుల కోటాలో చేర్చేసి స్పీచుల్లో గౌరవ వచనాలు పలికిస్తున్నారు. పవన్ ఇంత గౌరవంగా సజ్జలను గుర్తించడం వెనుక ఏం జరిగిందో జనసైనికులకూ అర్థం కావడం లేదు. సజ్జల తనను ఓసారి కలిశారని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చెప్పారు. వారి మధ్య చర్చలు జరిగాయి. ఏం చర్చలు జరిగాయి..? ఎందుకు జరిగాయో చెప్పలేదు కానీ.. అక్కడ మాట్లాడుకున్న మాటల్ని బట్టే విజ్ఞుడుగా సర్టిఫికెట్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. అసలు ఆ సమావేశం ఎలా జరిగింది.. ఎప్పుడు జరిగిందనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఇప్పుడు వైసీపీలో ప్రభుత్వంలో తిరుగులేని పవర్ సెంటర్. ఏం జరిగినా ఆయన కనుసన్నల్లోనే జరగాల్సిందే. ఏ చిన్న విషయమూ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ జరగదనేది అందరికీ తెలుసు. ఎవరెవర్ని ఎలా తిట్టాలో కూడా ఆయనే నిర్దేశిస్తారనేది వైసీపీలో బహిరంగ రహస్యం. పవన్ కల్యాణ్‌పై తిట్ల దండకానికి కూడా ఆయనే స్క్రిప్ట్ రైటర్ అనే విషయం వైసీపీ రాజకీయాల గురించి తెలిసినవారందరికీ తెలుసు. అయితే తనకేమీ తెలియదన్నట్లుగా పవన్ కల్యాణ్ సజ్జలను ఎందుకు పొగిడారో ఇప్పుడు అంతుబట్టని విషయం. తనేంటో కూడా సజ్జలకు తెలుసని పవన్ చెబుతున్నారు. అంటే ఇరువురి మధ్య సుహృద్భావంగానే చర్చుల జరిగాయి.
పవన్ కల్యాణ్‌తో సజ్జల భేటీ అయి చర్చలు జరిపారంటే అది జగన్‌కు తెలియకుడా జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. ఎందుకంటే సజ్జల జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. జగన్‌కు తెలియకుండా ఏ పనీ చేయరు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులతో సమావేశం కారు. జగన్ అనుమతితోనే పవన్‌తో చర్చలు జరిపి ఉంటారు. ఆ చర్చలు ఎప్పుడు జరిగాయి.. గత ఎన్నికలకు ముందా.. ఇటీవల అన్నది పవన్ చెబితేనే తెలియాలి. అంటే రెండు పార్టీల మధ్య బయటకు తెలియని రాజకీయం ఏదో జరిగిందని మాత్రం పవనే చూచాయగా బయట పెట్టారు. అందుకే సజ్జలపై పవన్ అంత అభిమానం చూపిస్తున్నారు. కొసమెరుపేమిటంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు సజ్జలను రాజ్యాంగేతర శక్తిగా విమర్శిస్తూ ఉంటాయి.