జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లో ఉంటారా లేక షూటింగ్‌లకు వెళ్తారా అన్నదానిపై స్పష్టత లేదు కానీ ఇప్పటికైతే బయటకు వచ్చి ఓ వేవ్ సృష్టించారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమో…లేకపోతే పవన్ కల్యాణ్‌కు పెరిగిన ఆదరణో చెప్పలేం కానీ ఆయన పర్యటనలకు మంచి స్పందన వచ్చింది. అయితే ఆయన ప్రసంగ శైలి..రాజకీయ వ్యూహాలు మొత్తం కులాల కోణంలోనే ఉండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
చేసింది శ్రమదానం – చెప్పింది కులాల పంచాంగం!
రోడ్లు బాగా లేవని .. శ్రమదానం చేసే కార్యక్రమాన్నిపవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ప్రభుత్వ వైఫల్యాలపై చాలా తక్కువ అంశాలే ఉన్నాయి. పన్నులు చెల్లిస్తున్నాం.. రోడ్లు వేయాల్సిన బాధ్యత ఉందని ఒకటి రెండు మాటలు చెప్పారు కానీ.. తర్వాత పూర్తిగా కులాల డిస్కషన్‌లోకి వెళ్లిపోయారు. ప్రభుత్వం ఓ కులాన్ని టార్గెట్ చేసుకుందని.. కాపు కులం ఏక తాటిపైకి రావాలని.. ఇలా ఆయన చాలా మాటలు మాట్లాడారు. అన్ని కులాల ప్రస్తావన తెచ్చారు. పనిలో పనిగా మతాల ప్రస్తావన తెచ్చారు. దూరంగా నమాజ్ వినిపిస్తే .. తను ప్రసంగాన్ని కూడా నిలిపివేస్తానని చెప్పారు. తన పూజ గదిలో క్రైస్తవం కూడా ఉంటుందన్నారు.
కులాలతోనే రాజకీయాలు నడుస్తున్నట్లుగా పవన్ తీరు!
పవన్ కల్యాణ్‌కు ఎవరు సలహాలిస్తున్నారో కానీ కులాలు మాత్రమే రాజకీయాల్ని శాసిస్తాయన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు.. ఇతర అంశాలు.. రాష్ట్ర అభివృద్ధి వంటివేమీ ఆయనకు పెద్దగా పట్టింపు లేదు. కేవలం ప్రభుత్వాలు అన్ని కులాల్ని తొక్కేస్తుందని చెబుతున్నారు. పవన్ ఎందుకిలా పూర్తిగా కుల రాజకీయాలలోకి వెళ్లిపోయారో జనసైనికులకు కూడా అర్థం కాని పరిస్థితి. అనంతపురం జిల్లాలోనూ అదే మాట్లాడారు. కుల రహిత సమాజమే లక్ష్యమన్నట్లుగా ఒకప్పుడు మాట్లాడే పవన్ ఇప్పుడు నేరుగా కుల రాజకీయాలు చేస్తున్నారు.
ప్రజాసమస్యలు పట్టించుకునే రాజకీయం లేనట్లేనా ?
కడుపు కాలినోడు కులం, మతం చూడడు. వాడికి కడుపు నింపేవారే నాయకుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కావొచ్చు.. కరోనా కొట్టిన దెబ్బ కావొచ్చు అత్యధిక మంది ఉపాధి కష్టాల్లో ఉన్నారు. కూలీ పనులు చేసుకునే వారిలో సంపాదించిన మొత్తం లో సగానికి పైగా మద్యం దుకాణాలకు చెల్లించాల్సిన పరిస్థితి. అంతకు మించి ఎన్నో సమస్యలు ఏపీలో ఉన్నాయి. వీటికి ఏదీ కులం కాదు. కానీపవన్ కు ఎందుకో అవేమీ కనిపించడం లేదు. కుల రాజకీయాలకే ఎజెండాగా వెళ్లిపోతున్నారు.