దేశంలో పెరిగిపోతున్న విభజనకు స్పష్టమైన సంకేతం ఈ ఏడాది గాంధీ జయంతి రోజున కనిపించింది. ఏ దేశంలో అయినా వారి జాతిపితగా ప్రకటించుకున్న వారిని ఎవరూ విమర్శించరు. ఏమైనా వారు తీసుకున్న నిర్ణయాలు తమకు నచ్చకపోతే వారి చావు కరెక్టే అని అసలు వాదించారు. అసలు అలా వాదిస్తారన్న వాళ్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. కానీ మన దేశం వేరు. మన జాతిపతగా ప్రకటించుకుని 70 ఏళ్ల పాటు గొప్పగా చెప్పుకున్న మహానుభావునిపై ఇప్పుడు సైకోతనం చూపించడం పెరిగిపోతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ.. ఆయన చావు కరెక్టే అన్నట్లుగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
గాంధీ జయంతి రోజున అనేక మంది గాడ్సేను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బీజేపీ నేతలు, ఆరెస్సెస్ భావజాలం ఉన్న వారు ఈ పోస్టులు పెట్టిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. నిన్నంతా గాడ్సే జిందాబాద్ ట్వీట్ ట్రెండింగ్లో ఉంది. ఇది సహజంగానే జాతిపితను అవమానించడమే. గతంలో బీజేపీ నేతలు అనేక మంది గాంధీని అవమానించారు. వారిపై ఎలాంటి చర్యలు బీజేపీ హైకమాండ్ తీసుకోలేదు. తరచూ గాంధీ మహాత్ముడిపై నిందలు వేయడాన్ని బీజేపీ నేతలు తమ భావజాల వ్యక్తీకరణగా భావిస్తూ ఉంటారు.
దేశానికి మహాత్ముడు మంచి చేశారనే 70 ఏళ్ల పాటు భావించాం. ఇప్పుడు ఎందుకు ఆయన చెడు చేశారని చెప్పాలని భావిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఆయనను చెడుగా చిత్రీకరించి ఏం సాధించాలనుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. మన జాతిపితను మనం దూషించుకుంటే.. విదేశాల్లో పోయేది మన పరువే. ఇది మనలో పెరిగిపోతున్న విభజనకు సజీవ సాక్ష్యం అని ప్రపంచం ముందు ఉంటుంది. కానీ విభజన రాజకీయాలతో అధికారమే అంతిమం.. దేశం ఎలా పోయినా పర్వాలేదనుకునే రాజకీయ నేతల చేతుల్లో ప్రస్తుతం దేశ భవిష్యత్ ఉంది. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజలే భావోద్వేగాలు.., తప్పుడు ప్రచారాలను నమ్మకుండా దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంది.